వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 కోసం విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ప్రతినిధులతో జరిపిన సమావేశంలో వికసిత్ భారత్-2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై చర్చించారు.
ప్రభుత్వాలు విజన్‌తో పని చేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్‌తో వచ్చిన ఫలితాలు చూశామని, నేడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలని చంద్రబాబు చెప్పారు. వినూత్న ఆలోచనతో, టెక్నాలజీని ఉపయోగించుకుని పేదరికం లేని సమాజం సాధించాలని, అందుకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ విజన్-2047 సిద్ధం చేయాలని సూచించారు. జనాభా సమతుల్యతపై లోతైన కసరత్తు చేసి ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో అన్ని రంగాల్లో విప్తవాత్మక మార్పులు వస్తాయని, అమరావతి, వైజాగ్ ఎఐ హబ్స్‌గా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నామని, ప్రతి సామాన్యుడికీ ఫలాలు అందాలని, రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యునిట్‌గా ప్రణాళికలు రచించాలని, అప్పుడే విజన్ డాక్యుమెంట్ కు సార్థకత చేకూరుతుందని తెలిపారు.
వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటు, ప్రకృతికి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలని సీఎం తెలిపారు. రాయలసీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. రాష్ట్ర ప్రగతిలో కీలకమైన విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలని చెప్పారు.
15 శాతం వృద్ధి రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాలని చంద్రబాబు చెబుతూ తద్వారా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. దీన్ని సాధించడానికి అవసరమైన సెక్టార్లలో అమలు చేయాల్సిన ప్రణాళికలు కీలకమని, మానవ వనరుల విషయంలో నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీని కోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించాలని వివరించారు.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం