వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. వేల హెక్టార్లలో వరి నారు మళ్లు నీటమునిగాయి. రహదారులపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాలతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటెత్తుతుంది.
కృష్ణా ఉపనదులైన ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగభద్రతో మరికొన్ని పాయలు సైతం పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. ఇవాళ ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు కాగా ప్రస్తుతం 317 అడుగుల నీటిమట్టం ఉంది.
జురాల నుంచి నీటి విడుదలతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 57,171 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో నిల్ గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 811.50 అడుగులకు చేరింది. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డ్యామ్ వద్ద ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరింత వరద నీరు పెరిగితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది.
మరోవైపు సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 504.9 అడుగుల నీటి మట్టం ఉంది. 4,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 8,480 క్యుసెక్కుల నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. మరోవంక, తుంగభద్ర జలాశయంలోకి రోజురోజుకు ఇన్‌ఫ్లో ఎక్కువై నిండుకుండలా మారుతోంది. జలాశయంలో అత్యధిక ఇన్‌ఫ్లో వుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 1,08,326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 59.056 టీఎంసీలు నీరు జలాశయంలో చేరాయి.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం