21న అఖిల పక్ష సమావేశం

21న అఖిల పక్ష సమావేశం
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు రోజు అంటే ఈ నెల 21న అఖిల పక్ష సమావేశం జరుగుతుందని పార్లమెంటరీ మంత్రిత్వశాఖ ప్రకటించింది. పార్లమెంటు ఉభయ సభల్లోని వివిధ పక్షాల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజ్జు ఆనవాయితీగా జరిపే ఈ సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని ఆ ప్రకటన తెలిపింది
 
లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్‌ గాంధీ తొలిసారి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అన్ని రాజకీయ పార్టీల పక్షనేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. జులై 21న అమరుల సంస్మరణ దినం కాబట్టి ఈ సమావేశానికి తాము హాజరుకాలేమని రాజ్యసభలో టిఎంసి పక్ష నేత డెరెక్‌ ఓబ్రియాన్‌ రిజ్జుకు రాసిన లేఖలో తెలిపారు. 
 
నీట్‌ పేపర్‌ లీక్‌, అగ్నిపథ్‌ పథకం రద్దు తదితర అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశముంది. పద్దెనిమిదో. లోక్‌సభ ఏర్పడిన తరువాత జరిగిన మొదటి సమావేశంలో నీట్‌, మణిపూర్‌లో మారణకాండ, అధిక ధరలు వంటి అంశాలపై ఉభయ సభలు దద్దరిల్లాయి. 
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని ఇచ్చిన సమాధానంలో మణిపూర్‌ కు సంబంధించిన ఊసే లేదని ప్రతిపక్షాలు రాజ్యసభలో వాకౌట్‌ చేశాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో నీట్‌, అగ్ని పథ్‌, ధరలు, నిరుద్యోగం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. 
 
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజే కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 
 
వరుసగా రెందో సారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించనున్నారు. ఆయన ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టగా, నిర్మలా సీతారామన్‌కు ఇది ఏడవ బడ్జెట్‌ కావడం విశేషం..2019లో మోదీ 2.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆమె నియుక్తులయ్యారు.