పంచాయతీల్లో నిధులు లేకపోయినా పట్టించుకోని రేవంత్!

పంచాయతీల్లో నిధులు లేకపోయినా పట్టించుకోని రేవంత్!
* రుణమాఫీకి షరతులపై బిజెపి ఆగ్రహం
 
పంచాయతీల్లో నిధులు లేక పనులు చేయలేమని ప్రజావాణిలో గ్రామ సెక్రటరీలు వెల్లడించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో పాలన దుర్భరంగా తయారైందని తెలిపారు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న సర్కార్ పెద్దలు ముందు పల్లెలకు పోతే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని చెప్పారు. 
 
అప్పు, సప్పు చేసి పల్లెల్లో అభివృద్ధి పనుల కోసం సర్పంచులు ఖర్చు చేస్తే వారికి ఇప్పటివరకు సర్కార్ బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. కమీషన్లు ఇచ్చే మంత్రుల కంపెనీలకు, కాంట్రాక్టర్లకు మాత్రం  వందల , వేల కోట్ల నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి వార్డ్ మెంబర్ తో సహా అందరికీ వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క దోచుకోవడం, దాచుకోవడానికే ప్రాధాన్యంఇస్తోందని మండిపడ్డారు.

నిజంగా గ్రామీణ ప్రాంత ప్రజల మీద సర్కార్ పెద్దలకు ప్రేమ ఉంటే పల్లె బాట పట్టాలని ముఖ్యమంత్రికి హితవు చెప్పారు.  అక్కడ ఉన్న పరిస్థితులు పరిష్కరిస్తే మీరు అనుకున్న ప్రజా పాలన కు సార్థకత  ఉంటదని చెప్పారు. అలా కాకుండా హైదరాబాద్ లో కూర్చుని, కాంట్రాక్టులు,కమీషన్ల కోసం పనిచేస్ ప్రజలు క్షమించరని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. సర్కార్ తీరులో మార్పు రాకుండే ప్రజాక్షేత్రంలో పర్యటించి సర్కార్ తీరును ఎండగడతామని తెలిపారు. వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 
తెలంగాణలో ఎటువంటి  షరతులు లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఇప్పుడు ఇన్ని షరతులు ఎందుకు పెట్టారని బీజేఎల్పీ నేత  ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా రేషన్ కార్డు అనే షరతు పెట్టీ చాలా మందిని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకే రేషన్ కార్డు లో ఉన్న అన్నదమ్ములు భూములు పంచుకొని విడివిడిగా రుణాలు తీసుకుంటారని పేర్కొంటూ వారి పరిస్థితి ఎంటని ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనమిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, కాని ఇప్పుడు రుణమాఫీకి మాత్రం రేషన్ కార్డును లింక్ చేస్తోందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద చాలా మంది ఉన్నారని, అందులో నలుగురి మీద రుణం ఉంటే ఒక్కరికే ఇవ్వడంతో మిగతా వారు నష్టపోతారని తెలిపారు.
 
కుటుంబంలో ఒక్కరికి చిన్న ఉద్యోగం ఉన్నా కుటుంబం మొత్తానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తారని చెప్పారు. షరతులు పెట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి షరతు లేకుండా రుణమాఫీ చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.