కానీ కాంగ్రెస్ పార్టీ తన దళిత నేత కే సురేశ్‌ని స్పీకర్ పదవికి నిల్చోబెట్టింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి స్పీకర్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఓం బిర్లా, కే సురేశ్‌లు నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది. రాజస్థాన్ కోటా నుంచి మూడవసారి బీజేపీ ఎంపిగా ఓం బిర్లా ఎన్నికయ్యారు.
వాస్తవానికి అధికార-విపక్షాల మధ్య లోక్సభ స్పీకర్ విషయంపై చర్చలు జరిగాయి. ఎన్డీఏ నిలబెట్టే స్పీకర్ అభ్యర్థికి మద్దతిస్తామని ఇండియా కూటమి ఒప్పుకుంది. కానీ అందుకు బదులుగా సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ని తాము నిర్ణయిస్తామని డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరలేదని సమాచారం. చివరికి అనూహ్యంగా కే సురేశ్‌ని స్పీకర్ పదవికి కాంగ్రెస్ నిలబెట్టింది.
“ప్రభుత్వ పాలనలో విపక్షం మద్దతివ్వాలని, నిర్మాణాత్మక బాధ్యత చేపట్టాలని ప్రధానమంత్రి అన్నారు. మేము స్పీకర్ కు మద్దతు ఇస్తామని, కానీ డిప్యూటీ స్పీకర్ పదవి మాకు కావాలని విపక్షం అడిగింది. స్పీకర్ విషయంలో మద్దతు కోసం రాజ్‌నాథ్ సింగ్ మల్లిఖార్జు ఖర్గేకి ఫోన్ చేశారు. డిప్యూటీ స్పీకర్ గురించి అడిగితే మళ్లీ ఫోన్ చేస్తానని, ఇంకా చేయలేదు. ఇది మా నేతకు అవమానం. మోదీకి నిర్మాణాత్మక సహకారం అక్కర్లేదు,” అని రాహుల్ గాంధీ విమర్శించారు.
స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభ స్పీకర్ పదవి అనేది పార్టీకి సంబంధించింది కాదని, ఇది సభా నిర్వహణకు సంబంధించిన అంశమని మంత్రి పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం ఆనవాయితీ అని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ స్పీకర్ పదవికి తమ అభ్యర్ధిని బరిలో నిలిపిందని విమర్శిచారు.
స్పీకర్ పదవికి ఇప్పటివరకూ ఎన్నడూ ఎన్నిక జరగలేదని గుర్తుచేశారు. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయిస్తే తాము ఎన్డీయే స్పీకర్ అభ్యర్ధికి మద్దతు ప్రకటిస్తామని కాంగ్రెస్ షరతు విధించిందని చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం సరైంది కాదని మంత్రి కిరణ్ రిజిజు పేర్కొంటూ షరతుల ఆధారంగా ప్రజాస్వామ్యం నడవదని స్పష్టం చేశారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు