సరిగా 50 ఏళ్ళ క్రితం దేశంలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి శకాన్ని సూచిస్తుంది. 1975లో ఇదే రోజున అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కేంద్రంలోని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సిఫార్సు మేరకు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎమర్జెన్సీ జూన్ 25, 1975 నుండి మార్చి 21, 1977 వరకు అమలులో ఉంది.
ఈ సమయంలో మొదటిసారి ప్రజల ప్రాధమిక హక్కులను తొలగించారు. పత్రికా స్వాతంత్రంపై గొడ్డలి పెట్టు అన్నట్లు సెన్సార్ షిప్ అమలు జరిపారు. లక్ష మందికి పైగా ప్రతిపక్ష శ్రేణులను, స్వేచ్ఛకోసం నినదించిన విద్యార్థులు, యువత, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యకర్తలతో జైళ్లను నింపేసారు. హద్దులేని ప్రభుత్వ నిర్బంధాలు కొనసాగాయి.
ప్రాథమిక హక్కులు అమలులో లేనందున ప్రభుత్వం ఎవరినైనా కాల్చి చంపినా కోర్టులు ప్రశ్నిపలేదని అంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రభుత్వ న్యాయవాది వాదించారంటే ఎటువంటి నిరంకుశ వ్యవస్థ కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. అసమ్మతిని అణిచివేయడం, పౌర హక్కులను కాలరాయడం, మీడియాను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయడం జరిగింది.
జూన్ 12, 1975 నాటి అలహాబాద్ హైకోర్టు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నికల అవకతవకలకు పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటిస్తూ, ఆమె ఆరేళ్ల వరకు మరే ఎన్నికలో పాల్గొనరాదని తీర్పు ఇవ్వడంతో దేశంలో ఓ చీకటి పాలనకు అంకురార్పణ జరిపారు.
అప్పటికే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో ప్రతిపక్షాలు, విద్యార్థి, యువజనులు అవినీతికి వ్యతిరేకంగా, సంపూర్ణ మార్పుకోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుపుతున్నారు. గుజరాత్ అసెంబ్లీకి అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన రోజుననే జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవినీతికి మారుపేరుగా నిలిచిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వం కూలిపోయి జనతా ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది.
దానితో దేశంలో కాంగ్రెస్ పాలనకు చివరి ఘడియలు ఏర్పడ్డాయని భయంతో అత్యవసర పరిస్థితికి పాల్పడ్డారు. ఇందిరా గాంధీ 1971 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుండి సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్‌ను ఓడించి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె ఎన్నికల అక్రమాలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమె ఎన్నికను రాజనారాయణ్ సవాలు చేశారు.
యశ్‌పాల్ కపూర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే ఆమె వ్యక్తిగత ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారని కోర్టు నిర్ధారించింది. ఇందిరాగాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారిస్తూ, జస్టిస్ సిన్హా ఆమెను పార్లమెంట్‌కు అనర్హులుగా ప్రకటించి, ఎన్నుకోబడిన ఏ పదవిని నిర్వహించకుండా ఆరేళ్ల నిషేధం విధించారు.
అయితే జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడిందనే సాకుతో అత్యవసర పరిస్థితి విధించడం గమనార్హం. 1971లో బాంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసిన పాకిస్తాన్‌తో ముగిసిన యుద్ధాన్ని ఓ సాకుగా చూపారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అత్యవసర పరిస్థితిని ప్రకటించాలనే ఆలోచనను వ్యతిరేకించినా, అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రేతో సహా కొంతమంది విధేయుల సలహాతో ఇందిరా గాంధీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెబుతారు.
ఆ సమయంలో ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ “రాజ్యాంగ-వ్యతిరేక” చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఏదో ఓ సాకు చూపడం కోసం ఎటువంటి సంబంధం లేకపోయినా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలపై నిషేధం విధించి, వాటి నాయకులను జైళ్లలో ఉంచారు. ప్రతిపక్ష నాయకులు అందరూ జైళ్లలో ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఎటువంటి చర్చ లేకుండానే రాజ్యాంగం పీఠికలో `సామ్యవాదం’, `లౌకికవాదం’ అనే అంశాలను చేర్చుతూ రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు.
అయితే ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా నాడు లోక్ సంఘర్ష సమితి నేతృత్వంలో ఆర్ఎస్ఎస్, ఎబివిపి వంటి సంస్థలు కలిసి సాగించిన నిరసన ఉద్యమం చారిత్రకమైన. ఈ సందర్భంగా జరిపిన సత్యాగ్రహాలలో సుమారు 80 వేల మంది అరెస్ట్ అయ్యారు. భారత స్వాతంత్ర పోరాటంలో కీలకమైన క్విట్ ఇండియా ఉద్యమంలో సహితం 30 వేల మందికి మించి అరెస్ట్ కాలేదు. డా. సుబ్రమణ్యస్వామి వంటి వారు తప్పించుకొని విదేశాలకు వెళ్లి అంతర్జాతీయంగా భారత్ లో హక్కుల అణచివేత గురించి ప్రచారం చేశారు.
నిర్బంధాలను ఎదిరించి దేశంలో ఉధృతమవుతున్న నిరసన ఉద్యమాలు ఒకవైపు, అంతర్జాతీయంగా పెరుగుతున్న వత్తిడుల కారణంగా జనవరి, 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలను ప్రకటించారు. వెంటనే జయప్రకాష్ నారాయణ్, జెపి కృపాలాని వంటి పెద్దల సారధ్యంలో ప్రతిపక్షాలు కలిసి జనతా పార్టీగా ఏర్పడి ఎన్నికలలో ఉమ్మడిగా పోటీచేశాయి. దేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు.
నాటి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం భవిష్యత్ లో మరోసారి అంతర్గత ఎమర్జెన్సీ విధించే అవకాశం లేకుండా రాజ్యాంగ సవరణ చేసింది. ఎమర్జెన్సీ విధించడం ఓ పొరపాటే అని అంగీకరించిన ఇందిరాగాంధీ ఓటమి తర్వాత మరో వెయ్యేళ్ళ వరకు ఎవ్వరూ దేశంలో అటువంటి సాహసం చేయబోరని ప్రకటించటం గమనార్హం. అయితే, అధికారికంగా ఎమర్జెన్సీ విధించి, హక్కులను అణచివేసి, నిరంకుశ పాల్పడే సాహసం ఎవ్వరూ చేయకపోయినా ఆ తర్వాత కూడా పలు ప్రభుత్వాలు పలు సందర్భాలలో నిరంకుశ ధోరణులు ప్రదర్శిస్తూనే ఉన్నాయి.
ముఖ్యంగా 1990వ దశకంలో నిబద్దతతో కాకుండా తప్పనిసరి పరిస్థితులలో ప్రారంభించిన ఆర్ధిక సంస్కరణలు ప్రజల హక్కులపై అణచివేతకు దారితీస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలపై నియంత్రణ వ్యవస్థలు లోపించడం, విధానపర నిర్ణయాలలో ప్రభుత్వ గుత్తాధిపత్యం కొనసాగిస్తూ ఉండటం, కార్పొరేట్ వ్యవస్థలు ప్రభుత్వ విధానాలను రూపొందించే స్థాయికి చేరుకోవడంతో ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి.
నేడు మీడియా సంస్థలు అన్ని వ్యాపార సంస్థలుగా, కార్పొరేట్ సామ్రాజ్యంలో ఓ భాగంగా మారడంతో నిబద్దతతో వార్తలు అందించే రోజులు గతిస్తున్నాయి. భిన్నాభిప్రాయాలు, అసమ్మతి పట్ల ప్రభుత్వాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. భూసేకరణ, గనుల తవ్వకం వంటి సమయాలలో ప్రజాభిప్రాయంకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పర్యావరణం గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదం ఎదుర్కొంటున్నది. మరోవంక ఆర్ధిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. ఇవ్వన్నీ సామాన్యుల జీవితాలను కల్లోలం కావిస్తున్నాయి.
ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికలలో దారుణంగా ఓటమి ఎదుర్కొన్న ఇందిరాగాంధీ తమ కుటుంభంకు హితుడైన బ్లీడ్జ్ పత్రిక సంపాదకుడు కరంజియాను కలిసి నిఘా సంస్థలు గెలుస్తామంటేనే ఎన్నికలకు వెళ్లానని, కానీ ఎందుకు ఓటమి ఎదురైందని అంటూ ప్రశ్నించారు. మీడియాపై ఆంక్షలు విధించడం వల్లనే జరిగింది అని ఆయన చెప్పారు.
మీడియాలో కేవలం ప్రభుత్వాన్ని పొగడ్తలతో నింపే కథనాలే ఉంటూ ఉండడంతో వాస్తవాలు తెలుసుకొనే అవకాశం ఆమెకు లేకుండా పోయిందని, పత్రికలలో వాస్తవాలు ప్రచురించి ఉంటె తమ ప్రభుత్వంలోని పొరపాట్లను సర్దుకొనే అవకాశం ఆమెకు లభించి ఉండేదని చెప్పారు.
ప్రజాస్వామ్య హక్కులను అణచివేసి, అసమ్మతికి అవకాశం లేకుండా చేస్తూ పాలన సాగించాలి అనుకొనే వారికి ఎమర్జెన్సీ ఓ విధంగా హెచ్చరికగా మిగులుతుంది. ఇటీవల ఎన్నికలలో కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ వంటి వారు ఓటమి చెందడానికి ప్రధాన కారణం తమ పాలనలో ఏమి జరుగుతుందో వారు తెలుసుకోలేక పోవడమే కావడం గమనార్హం.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు