ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!

ఏపీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!
సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడును అసెంబ్లీ స్పీకర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. టిడిపి ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న ఆయన 1983 నుండి ఒకే నియోజకవర్గం నుండి అన్ని ఎన్నికలలో పోటీచేసిన రాష్ట్రంలోనే ఏకైక నాయకుడిగా పేరొందారు.  ఇప్పటి వరకు 10 సార్లు ఎమ్యెల్యేగా పోటీచేయగా 7 సార్లు గెలుపొందారు. ఒక సారి ఎంపీగా గెలుపొందారు.
 
మంత్రి పదవుల పంపకం పూర్తి కావడంతో ఇప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్లకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. జనసేన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
చీఫ్‌ విప్‌గా టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి తొలి అసెంబ్లీ సమావేశాలను  జూన్ 24 నుంచి మూడు రోజుల పాటు అంటే జూన్ 26 వరకు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. 
 
వాస్తవానికి ఈ నెల 19 నుంచే సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉన్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. ఈ నెల 24న ప్రొటెం స్పీకర్ ఎన్నిక తర్వాత నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వస్తారా? అనేది చర్చగా మారింది. అందరు ఎమ్మెల్యేలతో కలిసి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా స్పీకర్ ఛాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.