
రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్ల (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులను సమకూర్చాలని తీర్మానించాయి.
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ గురువారం ఈ మేరకు కీలక పరిణామం జరిగింది. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో దాదాపు రూ.21.72 లక్షల కోట్ల విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేసి ఉన్నాయి. వాటిలో అత్యధికం ఐరోపా దేశాల్లోనివే.
సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్నదానిపై జీ7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి భారీ విధ్వంసం సృష్టించినందుకు రష్యా పరిహారం చెల్లించేదాకా, ప్రస్తుతం స్తంభింపజేసిన ఆ దేశ ఆస్తులపై ఆంక్షలను తొలగించకూడదనీ అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి.
తాజా రుణ ప్యాకేజీలో భాగంగా తొలి విడత నిధులు ఈ ఏడాదే ఉక్రెయిన్‌కు అందనున్నాయి. శుక్రవారం దీనిపై సంయుక్త ప్రకటన వెలువడనుంది. జీ7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలు. ఉక్రెయిన్‌కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల డాలర్లు అందజేయనున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తాజాగా ప్రకటించారు.
More Stories
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
గాజాలో అమెరికా ఎత్తుగడలకు సౌదీ చెక్
యూఎస్ మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకాలపై నిషేధం