జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా మూడోసారి అజిత్ దోవ‌ల్

జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా మూడోసారి అజిత్ దోవ‌ల్
అజిత్ దోవ‌ల్ మ‌ళ్లీ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా నియ‌మితుల‌య్యారు. మూడ‌వ‌సారి ఆయ‌న ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌నున్నారు. ఇక ప్ర‌ధాన మంత్రికి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా డాక్ట‌ర్ పీకే మిశ్రాను నియ‌మించారు. ఈనెల 10వ తేదీ నుంచి ఆ నియామ‌కం అమ‌లులోకి రానున్న‌ట్లు అపాయింట్స్ క‌మిటీ తెలిపింది. ప‌ద‌వీకాలం స‌మ‌యంలో పీకే మిశ్రాకు క్యాబినెట్ మంత్రి హోదా ర్యాంక్ ఇవ్వ‌నున్నారు. 
 
అంతేగాక, అజిత్ దోవల్‌కు కేబినెట్‌ మంత్రి హోదా ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్ఎస్ఏగా ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. వీరిద్దరి పదవీకాలం ప్రధాని పదవీకాలంతో సమానంగా ఉంటుందని లేదా తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. ప్ర‌ధాని మోదీకి స‌ల‌హాదారులుగా అమిత్ ఖేర్‌, త‌రుణ్ క‌పూర్‌ల‌ను నియ‌మించారు. రెండేళ్ల కాల‌ప‌రిమితి కోసం ఆ ఇద్ద‌ర్నీ నియ‌మించారు.
 
కాగా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014 మే 30న అజిత్ దోవల్ తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గాపనిచేశారు. అజిత్ దోవల్ 1968 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన 1945 జనవరి 20న జన్మించారు. ఆయన తండ్రి మేజర్ గుణానంద దోవల్ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు.ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా దోవల్ పేరొందారు. ప్రధానికి వ్యూహాత్మక ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలపై సూచనలు ఇస్తుంటారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో రహస్య గూఢచారిగా పని చేసిన ఆయన ఇండియన్ ‘జేమ్స్ బాండ్’గా పేరొందారు.

విదేశీ గూఢచార సంస్థ ‘రా’ను నిర్వహిస్తున్న ఆయన ప్రధాని ప్రతినిధిగా పీ-5 దేశాలతోపాటు ఇరుగుపొరుగు దేశాల వ్యవహరాలు చూసుకుంటారు. 2017లో డోక్లామ్ పీఠభూమిలో, 2020లో తూర్పు లడఖ్‌లో చైనా ఆర్మీ దురాక్రమణను ఎదుర్కోవడంలో అజిత్ దోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారు.

 చైనాతో సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో భారత ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు. పంజాబ్‌లో ఐబీ ఆపరేషనల్ చీఫ్‌గా, కశ్మీర్‌లో అదనపు డైరెక్టర్‌గా పనిచేశారు.  లండన్‌లో పనిచేస్తున్నప్పుడు ఖలిస్తానీ తీవ్రవాదాన్ని, ఇస్లామాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు పాకిస్తాన్ జిహాద్‌ను హ్యాండిల్ చేయడంలో దోవల్ తన పనితనం చాటారు.