ఉగ్రదాడులు కొనసాగుతుంటే.. పాక్‌తో యుద్ధం చేయకతప్పదు

* చనిపోయినట్లు నటించి బైటపడ్డ యాత్రికులు 

యాత్రికులే లక్షంగా జమ్ముకశ్మీర్‌లో పర్యాటక బస్సుపై ఆదివారం జరిగిన దాడి వెనుక ముగ్గురు విదేశీ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఆ ప్రాంతంలో మూడు ఉగ్రవాద గ్రూపులు ఆపరేట్ చేశాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రియాసీ రీజియన్‌లో అటవీ ప్రాంతంలో ఎగువ భాగంలో ఎవరూ వెళ్లడానికి వీలు లేని చోట కనీసం ఇద్దరైనా ఉగ్రవాదులు దాగి ఉంటారని, ఆ తరువాత దిగివచ్చి దాడికి పాల్పడి ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.  

ఉగ్రవాదులను కనుగొనడానికి భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ఎం 4 కార్బైన్స్, 1980లో అమెరికా తయారు చేసిన రైఫిల్స్, ఈ దాడికి ఉపయోగించినట్టు కనుగొన్నారు. ప్రపంచం అంతా మిలిటరీ దళాలు ఈ రైఫిల్స్‌ను వాడుతున్నాయి. పాకిస్థాన్ స్పెషల్ ఫోర్స్ సింధ్ పోలీస్ స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ కూడా ఈ రైఫిల్స్‌ను వాడుతున్నట్టు బయటపడింది.

ఆ బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించింది. ఇలాంటి మరిన్ని దాడులకు కూడా పాల్పడతామని హెచ్చరించింది. ముఖాలు కప్పుకున్న ఆరేడుగురు ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు.

కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం

జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులు ఇలాగే కొనసాగుతుంటే పాకిస్థాన్‌తో యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయడానికే మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ ఉగ్రదాడి జరిగిందని ఆయన ఆరోపించారు. 

ఎన్డీయే మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే కూడా కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజున రియాసీలో ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైందని కేంద్ర మంత్రి తెలిపారు. 

‘జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైందని నేను నమ్ముతున్నా. ప్రధాని మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మనం పాకిస్థాన్‌తో యుద్ధం ప్రారంభించాలి. చాలా మంది ఉగ్రవాదులు పీవోకే ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, జమ్ముకశ్మీర్‌లోని శివ్ ఖోరీ ఆలయం నుంచి ఖత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి 53 మంది యాత్రికులతో వెళ్తున్న బస్సుపై పోనీ ప్రాంతంలోని టెర్యాత్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. బస్సులోని పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణించిన 9 మంది మరణించగా 41 మంది గాయపడ్డారు. 

మరోవంక, ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు దాడుల సమయంలో తాము కాసేపు చనిపోయినట్లు నటించామని పేర్కొన్నారు. ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలన్న ఉద్దేశంతో.. తామంతా బస్సు లోపలే మౌనంగా ఉండిపోయామని తెలిపారు. సుమారు 15 నిమిషాల పాటు వాళ్లు కాల్పులు జరిపారని చెప్పారు.

‘‘ఆరేడు ఉగ్రవాదులు తొలుత బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. వాళ్లందరూ ముఖానికి మాస్కులు వేసుకొని ఉన్నారు. అన్నివైపులా నుంచి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇంతలో బస్సు లోయలో పడిపోయింది. అప్పటికీ ఆ ముష్కరులు విడిచిపెట్టలేదు. అటుగా వచ్చి మళ్లీ కాల్పులు కొనసాగించారు. ఆ సమయంలో మేమంతా చనిపోయినట్లు నటించాం. ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్లాలన్న ఉద్దేశంతో.. ఏమాత్రం కదలకుండా మౌనంగా ఉండిపోయాం. పది, పదిహేను నిమిషాల తర్వాత అక్కడికి స్థానికులతో పాటు పోలీసులు చేరుకొని మమ్మల్ని కాపాడారు’’ అని ఈ ఉగ్రదాడి నుంచి బయటపడిన బాధితులు మీడియాకు తెలిపారు.

రంగంలోకి దిగిన ఎన్ఐఏ

కాగా, ఈ దాడులు జరిపింది తామేనని పాక్ ఉగ్రవాదులు ప్రకటించిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఇదే సమయంలో.. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. డ్రోన్లతోనూ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. మరోవైపు.. బాధిత కుటుంబాలను నిశితంగా పరిశీలించి, వారిని ఆదుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన రూ.50 వేలు చొప్పున ఆర్థికసహాయం ప్రకటించారు.