టెండర్లు పిలవకుండా విద్యుత్ పనులు ఎలా కేటాయించారు?

కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానం పాటించకుండా టెండర్లు పిలవకుండా నిర్మాణం, కొనుగోళ్ల వల్ల ఆర్థికభారం అధికమై ప్రజాధనం వృథా కాదా? అని యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్‌ నరసింహారెడ్డి జ్యుడిషియల్‌ కమిషన్‌ అధికారులను ప్రశ్నించింది. 

ఈ మేరకు కమిషన్‌ సోమవారం విచారణ జరిపింది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేశ్​ చందా, అప్పటి జెన్‌కో-ట్రాన్స్‌కోల సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావులను కమిషన్‌ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది.

యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా బీహెచ్‌ఈఎల్‌(భెల్‌)కు కేటాయించాల్సిన అవసరం ఏంటని కమిషన్‌ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో టెండర్లు పిలిచి, తక్కువ ధరకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలనే నిబంధనలుంటే వాటిని ఎందుకు పాటించలేదని నిలదీసింది. 

భెల్‌ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అనేది టెండర్లు పిలిస్తేనే కదా తెలిసేదని ప్రశ్నించింది. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేటాయించడం వల్ల ఆర్థికభారం అదనంగా పడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందని కమిషన్‌ అడిగినట్లు తెలుస్తోంది.

మాజీ సీఎండీ ప్రభాకరరావు సమాధానమిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భెల్‌కు కేటాయించామని, ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొన్నట్లు వివరించారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఉంటేనే ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యమని ముందుగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని జాతీయ విద్యుత్‌ కారిడార్‌ను సరఫరా కోసం తీసుకున్నట్లు ప్రభాకరరావు వివరించారని సమాచారం.

పీపీఏ చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించడానికి ఇతర విద్యుత్‌ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అని అధికారులను కమిషన్‌ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో ఎంత తక్కువ ధరకు కరెంటు లభిస్తుందనేది టెండర్లు పిలిస్తేనే తెలుస్తుందని, దానికి అవసరమైన కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానాన్ని పక్కనపెట్టేసి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఆర్థికభారం పడింది కదా అని కమిషన్‌ పేర్కొన్నట్లు సమాచారం.