మళ్లీ ఆస్పత్రిలో చేరిన బ్రిటన్‌ రాజు చార్లెస్‌

బ్రిటన్ రాజు చార్లెస్-3 (75) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరోమారు లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. క్యాన్సర్‌ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. అంతకుముందు కింగ్‌ చార్లెస్‌ ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ సందర్భంగా చార్లెస్‌ భార్య క్వీన్ కెమిల్లా కంట నీరు పెట్టుకున్నారు.

వైద్యబృందం నుంచి సలహా తీసుకున్న తర్వాతనే చార్లెస్‌ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన తన ప్రసంగం నిడివిని 45 నిమిషాలకు తగ్గించుకున్నారు. బ్రిటన్‌ కింగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ గత ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు.

రాజు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్‌ చేసిన బకింగ్‌హామ్ ప్యాలెస్.. బ్రిటన్‌ రాజు వీలైనంత త్వరగా సాధారణ విధులలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది.  కాగా, కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని దేశమంతా ప్రార్థిస్తోందని చెప్పారు. బ్రిటన్లోని ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా కింగ్ చార్లెస్‌ కోలుకోవాలని ఆకాంక్షించింది.