కలుషిత ఆహారంతో ప్రతిరోజూ 16 లక్షల మందికి అనారోగ్యం

కలుషిత ఆహారంతో ప్రతిరోజూ 16 లక్షల మందికి అనారోగ్యం

అత్యధిక శాతం మంది ఆహారం కోసం హోటల్స్‌, ఫుడ్‌ స్టాల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వాటిలో నాణ్యత మాట పక్కన పెడిత శుభ్రతను పాటిస్తారా? లేదా? అనేది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ స్వయంగా ఇంటిలోనే శుభ్రంగా వండినప్పటికీ వంట నూనె నుండి అన్నీ కల్తీమయమే.

కలుషిత, అసురక్షిత ఆహారం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 16 లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) విస్మయం వ్యక్తం చేసింది. వీరిలో 40 శాతం మంది అసురక్షిత ఆహారం కారణంగా ఇప్పటికే పౌష్టికాహార లోపం, మరణాల ప్రమాదాన్ని అధికంగా ఎదుర్కొంటున్న ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. 

జూన్‌ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా డబ్ల్యుహెచ్‌ఒ ప్రాంతీయ డైరెక్టర్‌ సైమా వాజెద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ దాదాపు 16 లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారని  పేర్కొన్నారు. కలుషిత ఆహారం కారణంగా ఉత్పాదకతను తగ్గించడానికి దారితీస్తుందని, ఫలితంగా ఆహార సంబంధిత అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. 

డబ్ల్యుహెచ్‌ఒ ప్రకారం ఈ మొత్తం తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో 110 బిలియన్‌ డాలర్ల వార్షిక నష్టానికి దారి తీస్తోంది. కలుషితమైన ఆహారం విషయంలో ఆఫ్రికా తరువాత అత్యధికంగా ప్రభావితమైన రెండవ ప్రాంతం ఆగేయాసియా అని సైమావాజెద్‌ తెలిపారు. 

ఆహార భద్రత సమిష్టి బాధ్యత అని, ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఆహార భద్రతను నిర్థారించడంతో తమ వంతు పాత్రను పోషించాల్సి వుందని స్పష్టం చేశారు. మెరుగైన ఆరోగ్యం కోసం సురక్షితమైన పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.