లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ‘నోటా’కు 63.72 లక్షల ఓట్లు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ‘నోటా’కు 63.72 లక్షల ఓట్లు

2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు పూర్తిస్థాయిలో వెలువ‌డ్డాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో నోటా(న‌న్ ఆఫ్ ది ఎబౌ)కు 63,72,220 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. అత్య‌ధికంగా బీహార్ రాష్ట్రంలో 8,97,323 ఓట్లు నోటాకు ప‌డిన‌ట్లు పేర్కొన్నారు.

ఆ త‌ర్వాత ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 6,34,971 ఓట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 5,32,667 ఓట్లు, ప‌శ్చిమ బెంగాల్‌లో 5,22,724 ఓట్లు, త‌మిళ‌నాడులో 4,61,327 ఓట్లు, గుజ‌రాత్‌లో 4,49,252 ఓట్లు, మ‌హారాష్ట్ర‌లో 4,12,815 ఓట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 3,98,777 ఓట్లు, ఒడిశాలో 3,24,588 ఓట్లు నోటాకు పోల‌య్యాయి. 
 
2019 ఎన్నిక‌ల్లో నోటాకు పోలైన ఓట్లు 65,22,772. ఈ ఎన్నిక‌ల్లో ఆ సంఖ్య రెండు ల‌క్ష‌ల‌కు త‌గ్గింది. ఆ ఎన్నిక‌ల్లోనూ బీహార్‌లోనే అత్య‌ధికంగా 8,16,950 ఓట్లు నోటాకు పోల‌య్యాయి.
 
ఈ సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ అభ్యర్థి శంకర్‌ లాల్వానీ అత్యధిక మెజారిటీలో చరిత్ర సృష్టించారు. ఆయన తన ప్రత్యర్థిపై 11 లక్షల 75 వేల 92 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఓట్ల మెజారిటీలోనే కాదు అత్యధిక నోటా ఓట్లు పోలైన నియోజకవర్గంగా కూడా ఇండోర్‌ రికార్డుల్లో నిలిచింది. ఇక్కడ నోటాకు అత్యధికంగా 2.18 లక్షల ఓట్లు పోలయ్యాయి. 
 
ఇండోర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అక్షయ్‌ కాంతి బామ్‌ చివరి నిమిషంలో నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుని పార్టీకి షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నోటాకు ఓటు వేయాలని ప్రజలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. అత్యధిక మెజార్టీ 10 లక్షల ఓట్ల మార్క్‌ను దాటడం ఇదే మొదటిసారి. 50 ఓట్ల లోపు మెజార్టీతో ప్రత్యర్థిని మట్టికరిపించి ఓ అభ్యర్థి సంచలనం సృష్టించాడు.