ప్రధాని మోదీకి అమెరికా, కెనడా అధినేతల అభినందనలు

ప్రధాని మోదీకి అమెరికా, కెనడా అధినేతల అభినందనలు
మరోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేబడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని ట్రూడో అభినందనలు తెలిపారు.  ప్రపంచ అగ్రనేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొట్టమొదట ప్రధాని మోదీ అభినందించారు. మూడోసారి ప్రధానిగా విజయం సాధించడంపై మోదీకి, బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. 
 
ఉభయ దేశాల మధ్య సంబంధాల్లో కొత్త ప్రభుత్వం నుంచి మరింత ఊపు అందుకోగలదని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అమెరికా తరఫున బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్ హాజరు కానున్నారు. ఏప్రిల్ లోనే భారత్‌లో పర్యటించాలనుకున్న సుల్లివాన్ ఇరాన్‌ఇజ్రాయెల్ సంక్షోభం, పన్నూన్ సంఘటన కారణంగా పర్యటన వాయిదా పడింది. ఈమేరకు శ్వేతభవనం మోదీ విజయం చారిత్రాత్మకంగా అభివర్ణిస్తూ ఫోన్ ద్వారా ప్రకటించింది. ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభినందనలు తెలియజేశారు. “ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్లేలా మోదీ ప్రభుత్వంతో కలిసి కెనడా ప్రభుత్వం పనిచేస్తుంది. మానవ హక్కులను , వైవిధ్యాన్ని, చట్టాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్తాం” అని ట్రూడో తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. హర్‌దీప్‌సింగ్‌నిజ్జర్ హత్యతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ, ట్రూడో మోదీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.