కోట్లాది భారత అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన భారత క్రికెట్ జట్టు.. తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. బుధవారం నసావు అంతర్జాతీయ స్టేడియం (న్యూయార్క్) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. బంతితో హార్దిక్ (3/27), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ బుమ్రా (2/6), సిరాజ్ (2/35) బంతితో విజృంభించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయింది.
డెలాని (14 బంతుల్లో 26, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. అనంతరం ఛేదనను భారత్.. 12.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రిటైర్డ్ హర్ట్ అయినా రిషభ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో భారత్ శుభారంభం చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత పేసర్ల ధాటికి కుదేలైంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ వికెట్ల పతనానికి శ్రీకారం చుడితే హార్దిక్, బుమ్రా రాకతో ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ చేతులెత్తేసింది. 3వ ఓవర్లో అర్ష్‌దీప్.. ఐర్లాండ్ సారథి పాల్ స్టిర్లింగ్ (2), బల్బిర్ని (5)ని ఔట్ చేశాడు. హార్దిక్ తన తొలి ఓవర్లోనే టక్కర్ (10)ను క్లీన్‌బౌల్డ్ చేయగా 8వ ఓవర్లో బుమ్రా.. టెక్టర్ (4) ఆట కట్టించాడు. 9వ ఓవర్లో హార్దిక్.. కంఫర్ (12)ను పెవిలియన్‌కు పంపగా ఆ మరుసటి ఓవర్ వేసిన సిరాజ్ డాక్‌రెల్ (3)ను ఔట్ చేశాడు.
12 ఓవర్లు ముగిసేసరికి 52 పరుగులకే 8 వికెట్లు నష్టపోయిన ఐర్లాండ్ 60 అయినా చేస్తుందా? అనిపించినా అర్ష్‌దీప్ 16వ ఓవర్లో డెలాని.. 4, 6, 4తో 96 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ మూడో ఓవర్లోనే విరాట్ కోహ్లీ (1) వికెట్ కోల్పోయింది. రోహిత్‌తో ఓపెనింగ్ జోడీగా వచ్చిన కోహ్ అడైర్ 3వ ఓవర్లో వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని ఆడబోయి బ్యాట్ ఎడ్జ్‌కు తాకడంతో థర్డ్‌మ్యాన్ వద్ద బెంజిమెన్ వైట్‌కు క్యాచ్ ఇచ్చాడు.
కానీ మరో ఎండ్‌లో బౌండరీతో ఛేదన మొదలుపెట్టిన హిట్‌మ్యాన్ క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌కు పనిచెప్పాడు. 2022లో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డాక 528 రోజుల అనంతరం మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పంత్‌తో కలిసి భారత్‌ను విజయం దిశగా నడిపించాడు.
జోషువా లిటిల్ 9వ ఓవర్లో 2 భారీ సిక్సర్లు బాదిన రోహిత్ అడైర్ 10వ ఓవర్లో ఫోర్ కొట్టి 36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత జోషువా వేసిన బంతిని పుల్ చేయబోగా అది భుజానికి తాకడంతో అతడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే భారత విజయం ఖరారు కాగా సూర్యకుమార్ (2) నిష్క్రమించినా మెక్‌కార్తి 13వ ఓవర్లో రివర్స్ స్కూప్ సిక్సర్‌తో పంత్ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
రోహిత్ శర్మకు ఇది 9వ టీ20 ప్రపంచకప్. 2007 నుంచి ప్రస్తుత టోర్నీ దాకా అన్ని ఎడిషన్లలోనూ ఆడిన తొలి క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డులకెక్కాడు. జూన్ 8న శ్రీలంకతో జరిగే మ్యాచ్ ద్వారా బంగ్లాదేశ్ ఆటగాడు షకిబ్ అల్ హసన్.. రోహిత్ సరసన చేరుతాడు. టీ20లలో 4వేల పరుగులు మార్కు అందుకున్న మూడో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. కోహ్లీ, బాబర్ అతడి కంటే ముందున్నారు.
అత్యంత వేగంగా (2,860 బంతుల్లో) ఈ ఫీట్‌ను నమోదుచేసిన తొలి బ్యాటర్ రోహిత్. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ 600 సిక్సర్లు పూర్తిచేశాడు. మూడు ఫార్మాట్ల (499 ఇన్నింగ్స్)లో కలిపి ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ అతడే. క్రిస్ గేల్ (551 ఇన్నింగ్స్‌లలో 553) రెండో స్థానంలో ఉన్నాడు.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్