వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు కూడగట్టిన ‘పవర్’ స్టార్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి అంత ఘోర పరాజయం ఎదుర్కొంటుందని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు సహితం ఊహించలేదు. `నగదు బదిలీ’ పథకాలతో ఆయన గెలుపుకు ఢోకాలేదని అంచనా వేసిన వారందరికీ ఈ ఫలితాలు షాక్ కలిగించాయి.  ఈ ఎన్నికల ఫలితాలలో కీలక భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.
 
రెండేళ్లుగా వైఎస్ జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వరాదని చెబుతూ, అందుకోసం ఎంతో పట్టుదలతో ఆయన చేసిన కృషి ఫలితమే ఈ ఫలితాలను స్పష్టం అవుతుంది. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడిగా కలిసి ఉమ్మడిగా పోటీచేస్తే జగన్ ను ఓడించవచ్చని ఆయన చెప్పిన మాటలకు మొదట్లో పెద్దగా స్పందన లేదు. తన రాజకీయ ఉనికి కోసం చెబుతున్నారని చాలామంది అనుకున్నారు.
 
జనసేనతో పొత్తుకు మొదట్లో టిడిపి సహితం అంత సుముఖత వ్యక్తం చేయలేదు. బిజెపి అయితే టిడిపితో పొత్తుకోసం చివరి వరకు విముఖంగా ఉంటూ వచ్చింది. టిడిపితో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి బిజెపి, జనసేన కలిసి పోటీ చేద్దామని వత్తిడి చేస్తూ వచ్చింది.
 
అయితే అటువంటి పొత్తు ప్రమాదాన్ని మొదటగా గర్హించింది జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ, అవమానాలకు గురిచేస్తూ పొత్తు జరగకుండా విఫల ప్రయత్నం చేస్తూ వచ్చారు. బిజెపి పెద్దల ద్వారా పొత్తు జరగకుండా చేసే ప్రయత్నం చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ తో తానే పొత్తు పెట్టుకుంటానంటూ ప్రయత్నాలు చేశారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
 
వైఎస్సార్సీపీ అరాచక రాజ్యాన్ని కూల్చాలంటే వ్యక్తిగత అజెండాలు, పార్టీల జెండాలు పక్కన పెట్టి కూటమి కట్టాల్సిందేనని పట్టుబట్టారు. వైఎస్సార్సీపీ ఎన్నికుటిల ప్రయత్నాలు చేసినా, వ్యక్తిగత దూషణలకు దిగినా, కాపు నేతల్లో చీలికలు తేవాలని చూసినా పొత్తు ధర్మానికి నిలబడ్డారు. తప్పదనుకున్నప్పుడు కొన్ని సీట్లూ త్యజించారు! 
 
హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదంతో కూటమిని ప్రజాగ్రహానికి ప్రతిరూపంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతిమంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తన అన్న నాగబాబు పోటీ చేయాలి అనుకున్న అనకాపల్లి సీటును బిజెపి అభ్యర్థి కోసం త్యాగం చేశారు. మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశారు. ఆ ప్రయత్నాల కారణంగానే విస్మయకార ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.
 
గత ఏడాది చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే టిడిపి శ్రేణులు ఓ విధమైన భయానక పరిస్థితులలో చిక్కుకున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టేందుకు కూడా వెనుకాడారు. అయితే, రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబు నాయుడును కలిసి, ఏకపక్షంగా టీడీపీతో పొత్తు చేసుకుంటున్నట్లు ప్రకటించి రాజకీయాలను మలుపు తిప్పారు. పవన్ కళ్యాణ్ ఆ విధమైన ప్రకటన చేయడం టిడిపి శ్రేణులకు నూతన ఔత్సాహం కలిగించింది.
 
వాస్తవానికి పవన్ కళ్యాణ్ మద్దతు దారులలో సహితం ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలను కొన్నారు తప్పితే టిడిపితో పొత్తుకు సుముఖత లేదు. అయితే సొంతంగా పోటీచేస్తే గత ఎన్నికలలో ఒక సీటు మాత్రమే గెలిచామని, ఆ విధంగా ముఖ్యమంత్రి పదవి ఏ విధంగా వస్తుంది అంటూ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
2022 మార్చి 14న గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఓవైపు వెర్రితలలు వేస్తున్న వైఎస్సార్సీపీ అరాచక రాజకీయాలు! మరోవైపు సీఎం సీఎం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనసైనికుల నినాదాలు! ఆ సమయంలో ఆయన చెప్పిన ఒకేఒక్క మాట రాష్ట్రంలో కూటమికి నాంది పలికింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే ప్రసక్తే లేదని చెప్పిన మాట అప్పటి వరకూ ఉన్న రాజకీయాలను మలుపు తిప్పింది. 
 
వైనాట్‌ 175 అంటూ వైఎస్సార్సీపీ వేసుకున్న లెక్కల్ని తారుమారు చేసి రాష్ట్రంలో అధికార మార్పిడికి పవన్ కళ్యాణ్ చూపిన చొరవ, పట్టుదల మాత్రమే మార్గం చూపిందని చెప్పవచ్చు. విపక్షాలన్నీ ఏకమైతే తమ అధికారం గల్లంతేననే గ్రహించిన వైసిపి అప్పటి నుంచి పవన్‌పై ముప్పేట దాడికి దిగింది. సినిమా ప్రదర్శనకు ఆంక్షలు, పవన్‌ పర్యటనలకు అడ్డంకులు, అడుగు బయటపెట్టనీయకుండా పోలీసుల కాపలాలు, చివరకు అభిమానులకు అభివాదం కూడా చేయొద్దనే వరకూ వెళ్లడం జరిగింది. 
 
 వైఎస్సార్సీపీ కాపు నాయకులతో రోజూ తిట్టించడం, పావలా కల్యాణ్‌ అంటూ హేళన చేయడం నిత్యకృత్యమైంది. చివరకు పవన్‌కు తిక్కంటూ నోరుపారేసుకున్నారు. ఐతే నా తిక్కకూ ఓ లెక్కుందంటూ పవన్‌ ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ నాయకుల విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతూ వచ్చారు. వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించాలనే యజ్ఞంలో ఇవన్నీ పట్టించుకోకూడదని దీక్షపూనారు. 
 
పార్టీ శ్రేణులనూ ఆ విధంగానే సమాయాత్తం చేస్తూ వచ్చారు! చివరకు చంద్రబాబు అరెస్టు సమయంలోపొత్తుపై ప్రకటన చేశారు. జైలులో చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అక్కడే స్పష్టం చేశారు.