మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ) లిఖిత పూర్వకంగా మద్దతు ఇచ్చాయి. దీంతో జూన్ 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే నేతలు కలువనున్నారు. జూన్ 8న మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు ఎన్డీయే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్నది.
డిల్లీ కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. 60 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టే నేతగా మోదీ రికార్డులకెక్కనున్నారు.
ఇలా ఉండగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్‌సభను రద్దు చేశారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఉదయం సిఫారసు చేసిన వెంటనే మోదీ తన రాజీనామాతో పాటు మంత్రివర్గ రాజీనామా పత్రాలను రాష్ట్రపతిని కలిసి నేరుగా కలిసి సమర్పించారు.
రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలుపుతూ, కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంతవరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. అనంతరం కొద్ది గంటలకే 17వ లోక్‌సభను రద్దయినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ”జూన్ 5వ తేదీ 2024న కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసు మేరకు రాజ్యాంగంలోని 85వ నిబంధన సబ్-క్లాజ్ (2) కింద నాకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ 17వ లోక్‌సభను రద్దు చేస్తున్నాను” అని రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ఖర్గే ఇంట్లో ‘ఇండియా’ సమావేశం
మరోవైపు ఇండియా కూటమి నేతలు సైతం తదుపరి వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. రాజ్యాంగ విలువలను కాపాడే నిబద్ధత ఉన్న పార్టీలను కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తాము ఐక్యంగా, కృతనిశ్చయంతో పోరాడామని పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి స్పష్టమైన నైతిక పరాజయమని, వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయనకు భారీ నష్టమని తెలిపారు. ప్రజా తీర్పు మోదీకి, ఆయన రాజకీయ శైలికి వ్యతిరేకంగానే వచ్చిందని పేర్కొన్నారు. ప్రజల అభీష్టాన్ని తారుమారు చేయాలని మోదీ నిర్ణయించుకున్నారని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు శరద్ పవార్, స్టాలిన్, చంపయీ సోరెన్, తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి, రాఘవ్ చడ్డా, కల్పనా సోరెన్ సహా ఇతర ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు.

More Stories
11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత
హైకోర్టు తీర్పుతో భోజ్‌శాల సముదాయంలో విశేషంగా పూజలు!
భారత్‌లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్