తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత, మరోసారి ఎన్డీఏ నేతల సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎన్డీఏ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరుకావాలని నిర్ణయించారు. ఎల్లుండి రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.
అందులో భాగంగా ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని, ఆ కార్యక్రమం అనంతరం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారం రోజుల్లోగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు? ఇప్పుడు ఇవే అంశాలపై అంతటా ఆసక్తి నెలకొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంత్రివర్గంలో చేరే విషయమై స్పష్టత రావడం లేదు. లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే వాదన బయలుదేరింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా చేసి మొత్తం పార్టీ వ్యవహారాలు ఆయన కనుసన్నలలో జరిగే విధంగా చూడాలనే ఆలోచనలు జరుగుతున్నాయి.
అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో, ఈసారి మంత్రివర్గం ఎంపిక సహితం సవాల్ తో కూడుకొనున్నది.
కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యం కావటం లేదు.
తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థిత్వాల ఎంపికలోనూ గతంలోకన్నా ఈసారి అధిక సంఖ్యలోనే మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకే అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా? అన్న దానిపై ఇంకా పార్టీపరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లైతే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశముంది.
జనసేన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అగ్రవర్గాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా నలుగురికి ప్రాతినిథ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు. బీసీ వర్గాల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు.
బీజేపీ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కేలా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. జనసేన, బిజెపిలకు ప్రాతినిధ్యం ఇచ్చిన తర్వాత టిడిపి నుండి 20 మందికి మించి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు. అంటే సుమారుగా ప్రతి 15 మంది ఎమ్యెల్యేలలో ఒకరికి అవకాశం లభిస్తుంది. దానితో మంత్రి పదవులకు తీవ్రమైన పోయి నెలకొనే అవకాశం ఉంది. అదేవిధంగా సీనియర్లను సహితం పూర్తిగా విస్మరించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
More Stories
అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలా సీతారామన్