సెలవుపై వెళ్లిన సీఎస్‌ జవహర్‌రెడ్డి

సెలవుపై వెళ్లిన సీఎస్‌ జవహర్‌రెడ్డి
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్‌ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్‌ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. సిఎస్‌ పదవి నుంచి అధికారికంగా ఆయన వైదొలగినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త సిఎస్‌ ఎంపికపై కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 
 
బుధవారం చంద్రబాబుతో భేటీ సందర్భంగా ఆయన్నే కొనసాగించే ఉద్దేశం టీడీపీ ప్రభుత్వానికి లేదనే సమాచారాన్ని అందించారు. దీంతో గురువారం వ్యక్తిగత కారణాలతో సెలవు పై వెళుతున్నట్లు తెలుపుతూ జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్‌కు డసెలవు లేఖను పంపారు.  మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారులు అందరినీ తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాజీనామా చేయని సలహాదారులను కూడా తొలగించాలని ఆదేశించింది. అనారోగ్య కారణాలతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు.
 
కాగా, టిడిపికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో కీలక పాత్ర వహించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు గురువారం చంద్రబాబు నాయుడును కలిసేందుకు విఫలయత్నం చేశారు. అయితే అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది ఆయన ఇంటి గేటు నుండి  వెనుకకు పంపించారు.
 
ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎన్నికల కమిషన్ తొలగించిన పి ఎస్ ఆర్ ఆంజనేయులు, గత ఏడాది చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సిఐడి సిట్ చీఫ్ గా వ్యవహరించిన కొల్లి రఘురామిరెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్, డా. నారాయణ తదితరులపై అక్రమ కేసులు అనేకం నమోదు చేసిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి చీఫ్ సంజయ్ లు టిడిపి అధినేతను కలిసేందుకు ప్రయత్నం చేశారు.
 
ఇప్పటికే రఘురామిరెడ్డిని సిట్ చీఫ్ పదవి నుండితో పాటు అన్ని బాధ్యతల నుండి తప్పించారు. గవర్నర్ ఆదేశంపై సిట్ కార్యాలయంకు సీల్ వేశారు. సచివాలయం నుండి ఒక్క కాగితం కూడా బైటకు పోకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని గవర్నర్ ఆదేశించారు. ఇలా ఉండగా, ఏపీ ఫైబర్ ఆఫీస్​ను విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరనీ బయటకు పంపించి ఆఫీస్​ను సీజ్ చేశారు.

మరోవైపు తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్​ను సైతం అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వం మారుతున్న సమయంలో సిట్ ఆఫీస్‌ను సీజ్ చేయాలని గవర్నర్ ఆదేశాల్లో భాగంగానే కార్యాలయానికి తాళాలు వేశారు. ఇప్పటికే చీఫ్ సెక్రెటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, విభాగాధిపతి ఆఫీస్‌లలో డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.