
లోక్ సభ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగా ఉండే సంకేతాలు కనిపిస్తున్నా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆశించిన విధంగా 400 సీట్లు గెల్చుకొనే అవకాశాలు కన్పించకపోతున్నప్పటికీ 300 సీట్లకు చేరుకొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
మరోవంక, ఇండియా కూటమి పక్షాలు సహితం మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. 12 గంటల ప్రాంతంలో 297 సీట్లలో ఎన్డీయే ఆధిక్యతలో ఉండగా, ఇండియా కూటమి 228 సీట్లలో ఆధిక్యతలో ఉంది. మధ్య ప్రదేశ్, బీహార్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో ఎన్డీయే కూటమి ఏకపక్షంగా విజయంవైపు దూసుకు వెడుతున్నది.
అయితే ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాలలో ప్రతికూలత ఎదుర్కొంటున్నది. దానితో బిజెపి సొంతంగా మెజారిటీకి అవసరమైన 272 సీట్లు గెల్చుకొనే అవకాశాల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో సాధించిన విజయాలతో జాతీయ స్థాయిలో ఎన్డీయే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇండియా కూటమిలో కాంగ్రెస్ కాకున్నా పలు భాగస్వామ్య పార్టీలు సహితం రెండంకెల సీట్లు గెల్చు కొంటుండగా, ఎన్డీయే కూటమిలో టిడిపి మినహా ఇతర పార్టీలు ఏవీ చెప్పుకోదగిన సీట్లు గెల్చుకోవడం లేదు. దానితో ఎన్డీయే సీట్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలుబడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎదురులేకుండా సాగిన నవీన్ పట్నాక్ సర్కారుకు ఇప్పుడు బీజేపీ జలక్ ఇచ్చింది. తాజా కౌంటింగ్ సమాచారం ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. 147 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో.. ప్రస్తుతం బీజేపీ 74 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. మరో వైపు బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 13, ఇతరులు 3 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.
బీజూ జనతాదళ్ ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది. సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఆ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఈసారి ఒడిశాపై కన్నేసిన బీజేపీ.. నవీన్ దూకుడుకు బ్రేక్ వేసింది. పట్నాయక్ ప్రభుత్వ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒడిశాలో పనిచేశాయి. కాంటబంజి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నవీక పట్నాయక్ వెనుకంజలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఇండియా కూటమి ఎన్నికలలో ప్రభావం చేయబోతున్నట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విధంగా బిజెపి, ఇతర భాగస్వామ్య పక్షాలు ఫలితాలు చూపలేక పోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రాలో బిజెపితో జతకట్టిన శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలు చెప్పుకోదగిన ఫలితాలు చూపలేక పోతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో సమాజావాది పార్టీ, తమిళ నాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్ లో టిఎంసి ఎగ్జిట్ పోల్స్ ను మించి ప్రభావం చూపగలుగుతున్నాయి.
More Stories
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట