ఏడాదికో ప్రధాని.. ‘ఇండియా’ కూటమి కొత్త ఫార్ములా

* ఓబీసీలకు కాంగ్రెస్ అతిపెద్ద శత్రువు

‘ఇండియా’ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో ఏడాదికి ఒకరిని ప్రధాన మంత్రి చేసే ఆలోచనలో ప్రస్తుతం విపక్ష కూటమి ఉన్నట్లు తెలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌ లోని బేతుల్‌లో బుధవారంనాడు ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ప్రధాని కుర్చీలో ఏడాదికో ప్రధానిని నిలపాలనే ఆలోచనలో ఇండియా కూటమి ఉన్నట్టు కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 

అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో చేయాల్సిన పనులపై తాను కసరత్తు చేస్తుంటే, విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థిని కూడా ప్రకటించ లేకపోయిందని ఎద్దేవా చేశారు.

”వారి (‘ఇండియా’ కూటమి) ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది దేశానికి తెలియాలి. మావైపు నుంచి పదేళ్ల ట్రాక్ రికార్డుతో మోదీ మీ ముందే ఉన్నారు. విపక్షాలు పీఎం ఫేస్‌ కోసం వెతికి ఒక్కరినీ ఎంచుకోలేకపోయాయి. ఏడాదికో ఒకరిని ప్రధానిని చేసే ఆలోచన జరుగుతోందని మీడియాలో ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. అంటే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అవుతారు. అప్పుడు దేశానికి ఏం జరుగుతుంది?” అని మోదీ ప్రశ్నించారు.

‘ఇండియా’ కూటమి పీఎం ఫార్ములాపై మోదీ మరింత లోతుగా మాట్లాడుతూ, ఏడాదికో ప్రధాని ఫార్ములా అంటే ప్రధాని కుర్చీని వేలానికి పెట్టడమే అవుతుందని ధ్వజమెత్తారు. ”ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుంటారు. ఆయన ఏడాది పదవీకాలం పూర్తయ్యేంత వరకూ తగ్గిన నలుగురు వేచిచూస్తుంటారు” అని తెలిపారు. 

ఇది చాలా భయానక ప్రతిపాదన అని, దేశాన్ని ధ్వంసం చేస్తుందని పేర్కొంటూ ఇందవల్ల మీ స్వప్నాలు చెల్లాచెదురవుతాయని ర్యాలీకి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి మోదీ హెచ్చరించారు. ఈనెల 26వ తేదీన లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగనుంది.

కాగా, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల అంశంలో కాంగ్రెస్ తీరును ప్రధాని మోదీ దుయ్యబడుతూ ఓబీసీలకు కాంగ్రెస్ పెద్ద శత్రువని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటైన క్ర‌మంలో ఏపీలో ఆ పార్టీ తొలుత మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ ప్ర‌వేశ‌పెట్టింద‌ని గుర్తుచేశారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌న ప్ర‌య‌త్నాల్లో పూర్తిగా విజ‌య‌వంతం కాలేద‌ని పేర్కొన్నారు.

 మ‌ళ్లీ అదే గేమ్‌ను మ‌రోసారి ప్ర‌యోగించాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోంద‌ని చెప్పారు. ఓబీసీ కోటా కింద క‌ర్నాట‌క‌లో ఓబీసీలు పొందే రిజ‌ర్వేష‌న్ కోటాకు క‌త్తెర వేసేందుకు ముస్లింలంద‌రినీ ఓబీసీ కోటాలో చేర్చింద‌ని ప్రధాని వివ‌రించారు. కాంగ్రెస్ చేప‌ట్టిన ఈ చ‌ర్య దేశ‌వ్యాప్తంగా ఓబీసీ వ‌ర్గాల‌కు హెచ్చ‌రిక సంకేతం వంటిద‌ని ప్ర‌ధాని హెచ్చరించారు.