
ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఎలా ఆంక్షలు విధించాలన్న అంశంపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నాయకత్వం వహించాలని పేర్కొంటూ ఇందు కోసం శ్వేతపత్రం విడుదల చేసి, దానిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని చెప్పారు.
ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందని, ఈ అంశంలో రాజకీయ పార్టీలను ఎలా కట్టడి చేయాలనే దానిపై లోతైన చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఉచితాల ఖర్చు, ప్రయోజనాలపై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని చెబుతూ ప్రజలకు ఎలా విద్యనందించాలనే దానిపై అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ గవర్నర్ పేర్కొన్నారు.
ఇది రాజకీయ అంశమని, దీనిపై రాజకీయంగా ఏకాభిప్రాయం ఉండాలని భావిస్తున్నానని చెప్పారు. ఉచితాలను ఎలా అరికట్టగలమో, ఎలా అమలు చేయగలమో ప్రభుత్వం నిర్ధారించాని తెలిపారు. భారత్ వంటి పేద దేశంలో బలహీన వర్గాలకు సామాజిక భద్రతను అందించాల్సి ఉంటుందని, అయితే ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఎంతవరకు అందించగలరో రాజకీయ పార్టీల నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఇది వారి బాధ్యత అని సుబ్బారావు పేర్కొన్నారు.
డబ్బు పంపిణీ ఉత్తమమా లేక అంతకుమించి ఇంకేదైనా మెరుగ్గా చేయగలమా అనే దానిని పార్టీలు పరిశీలించుకోవాలని హితవు చెప్పారు. ఉచిత హామీలపై మరింత అవగాహన ఉండాలని భావిస్తున్నానని చెబుతూ అదే సమయంలో తీవ్రంగా చర్చించాలని, రాజకీయ పార్టీలపై నియంత్రణ ఎలా విధించవచ్చో మార్గం కనుగొనాలని సుబ్బారావు తెలిపారు.
కొన్ని రాష్ట్రాలు ద్రవ్యలోటు బాధ్యతను మరచిపోతున్నాయని, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితులను మించిపోతున్నాయని దువ్వూరి సుబ్బారావు గుర్తుచేశారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను కలిగివుండడం చాలా ముఖ్యమని, ఎఫ్‌ఆర్‌బీఎం లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఐఎంఎఫ్ అధ్యయనం ప్రకారం 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 7.6 శాతం స్థిరమైన వృద్ధి రేటును సాధించాలని తెలిపారు.
చైనాతో పాటు కొన్ని దేశాల మాదిరిగా 25 ఏళ్లపాటు ఏడాదికి చొప్పున 25 సంవత్సరాలపాటు 7.6 శాతం వృద్ధి రేటును కొనసాగించడానికి ప్రయత్నించాలని, అయితే వేర్వేరు కారణాల దృష్ట్యా సంక్లిష్టమేనని చెప్పారు. వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయాల వంటి సవాళ్ల మధ్య భారత్ దాన్ని ఎంత వరకు కొనసాగించగలదనేది చెప్పడం కష్టమేనని స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందిన దేశానికి చట్టబద్ధ పాలన, బలమైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పటిష్టమైన సంస్థలు నాలుగు స్తంభాల్లాంటివని పేర్కొంటూ ఈ నాలుగు మనకు లేవని చెప్పలేమని.. అదే సమయంలో ఉన్నాయనీ అనుకోలేని పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. వాటిని మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ అభిప్రాయపడ్డారు.
More Stories
ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
భారత శ్రామిక శక్తికి కృత్రిమ మేధస్సుతో ముప్పు
ఎస్బీఐ నికర లాభం రూ.16,891 కోట్లు