భారత్ వైపు గ్లోబల్ కేపబులిటీ కేంద్రాలు

భారత్ వైపు గ్లోబల్ కేపబులిటీ కేంద్రాలు
 
* బెంగుళూరు, హైదరాబాద్ లకే అవకాశం
 
అంతర్జాతీయ దిగ్గజ బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ కేంద్రాలను స్థాపించేందుకు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. టెక్నికల్ నాలెడ్జ్ గల మానవ వనరుల లభ్యత అధికంగా ఉండడం, బలమైన అంకుర సంస్థల వ్యవస్థ, అందుకు ప్రభుత్వ మద్దతు.. భారత్ వైపు ఆ సంస్థలు చూసేందుకు కీలకమైన అంశాలుగా తెలుస్తోంది. 
 
ఇన్ని సౌలభ్యాలు ఉన్నందునే బహుళజాతి కంపెనీలు కొత్త జీసీసీలను భారత్ లో అధికంగా స్థాపిస్తున్నాయని ఏఎన్ఎస్ఆర్ అనే కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ తన త్రైమాసిక రిపోర్ట్ లో తెలిపింది.  ఈ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ కేపబులిటీ కేంద్రాల వ్యాపారం విలువ ప్రస్తుతం 46 బిలియన్ డాలర్లుగా ఉందని, అది 20230 నాటికి 110 బిలియన్ డాలర్లకు అంటే రూ.9 లక్షల కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
దాదాపు 2400 జీసీసీ కేంద్రాల్లో 45 లక్షల మందికి ఉద్యోగాలు లభించవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు జీసీసీ కేంద్రాలను ఆకర్షించడంలో మన దేశంలో సిలికాన్ వాలీ అయిన బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. బెంగళూరు వాటా 30 శాతంగా ఉండగా, హైదరాబాద్ వాటా 19 శాతంగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై నగరాలు ఉన్నాయి. అలాగే అహ్మదాబాద్ లోని గిఫ్ట్ సిటీ జీసీసీ కేంద్రస్థానంగా గుర్తింపు సాధిస్తోంది.
 
డిజిటల్ సామర్థ్యాలు గల జీసీసీలను ఏర్పాటు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి కంపెనీలు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ ప్రాజెక్టులు చేపట్టగల సత్తా ఉన్న కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అవసరాల కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మారాయి. ఏఐ, ఎంఎల్, బిజినెస్ అనలిటిక్స్ సత్తా గల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. అందులోనూ హెల్త్ సర్వీసెస్, హై ఎండ్ టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, రిటైల్ రంగాల్లో ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.  జీసీసీల ఏర్పాటుతో ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగవంతమైన వృద్ధి నమోదు చేసే అవకాశం ఏర్పడుతోంది. 
 
మన దేశంలో దాదాపు 15 నగరాల్లో జీసీసీ కేంద్రాలు ఏర్పటవుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల్లో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీల కోసం 2025 నాటికి దాదాపు 6 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆఫీసు స్థలం అవసరమవుతుందని అంచనా. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలైన అహ్మాదాబాద్, కోయంబత్తూర్, భువనేశ్వర్, వడోదర వంటివి సైతం ఈ కేంద్రాలను ఆకర్షిస్తున్నాయి.