జగన్‌పై రాయి దాడి కేసులో టీడీపీ కార్యకర్త విడుదల

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరిపిన కేసులో అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును శనివారం రాత్రి పోలీసులు విడిచిపెట్టారు. దుర్గారావును తీసుకెళ్లిన పోలీసులు..అరెస్టు చూపించకపోవడంతో అతని తరఫు న్యాయవాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.
 
మరోవంక  దుర్గారావు ఆచూకీ కోసం నాలుగు రోజులుగా ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు చుట్టూ తిరిగారు. విజయవాడ  పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెక కాలనీ వాసులు శనివారం ఆందోళన చేశారు. వారిని పోలీసులు బలవంతంగా తరలించారు.  పైగా,అతనిపై ఎటువంటి ఆధారాలు దొరకక పోవడంతో పోలీసులు దుర్గారావును విడిచిపెట్టారు.
 
ఈ నెల 16న దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది.  చివరకు దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి, మళ్లీ విచారణకు పిలిచినప్పుడు హాజరవ్వాలని తెలిపారు. 
 
కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్‌ను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు ముందుగా భావించారు. కానీ ఇప్పుడు మేజిస్ట్రేట్‌ వద్ద వాంగ్మూలం తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సతీష్ రాయి విసిరినట్లు చూసిన వాళ్లు లేకపోవడంతో సీఆర్పీసీ 164 కింద సతీష్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి వాంగ్మూలం రికార్డు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. విడుదల అనంతరం దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ విచారణలో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు చేయమని చెప్పారు కదా అని పోలీసులు ‌ ప్రశ్నించారని తెలిపారు. సీఎం జగన్ పై దాడికి పాల్పడిన సతీష్ తమ కాలనీలో ఉంటాడు కానీ అతనితో పరిచయంలేదని స్పష్టం చేశారు.
 
 రాయి దాడిలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని చాలా మంది పోలీసులు తనను విచారించారని, తన ఫోన్ తనిఖీ చేశారని, అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న కారణంగానే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. మూడు రోజుల పాటు అనేక కోణాల్లో విచారించారని, తనపై ఎటువంటి ఆధారం లేకపోవడంతో థన్  తప్పు లేదని తెలిసి విడిచిపెట్టారని పేర్కొన్నారు.
 
వడ్డేర కాలనీకి చెందిన సతీష్ ను అరెస్టు చేసి అతడే సీఎం జగన్ పై రాయితో దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడు సతీష్ కు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో ఏ2గా టీడీపీ నేతల పేర్లు వినిపించాయి. టీడీపీ కార్యకర్త దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించారు. 
 
దుర్గారావు  బోండా ఉమా అనుచరుడు కావడంతోబోండా ఉమా ప్రోద్భలంతోనే దుర్గారావు, సతీష్ తో దాడి చేయించాడన్న ప్రచారం జరిగింది. బోండా ఉమాను అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే దుర్గారావును పోలీసులు విడిచిపెట్టడంతో ఈ కేసులో ఏ2 ఎవరనే ప్రశ్న తలెత్తుతుంది.