గులాబీ దళపతి కెసిఆర్ కోటరీ, అప్పటి మంత్రుల వ్యవహారశైలి, ఎంఎల్‌ఎల కేంద్రంగా రాజకీయాలు నడపడం, ముఖ్యమంత్రి దగ్గర నుండి ఎంఎల్‌ఎల వరకు అధికారాన్ని చూసి అహంకారపూరితంగా వ్యవహరించడం తదితర కారణాలతో అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘోరంగా ఓటమి పాలైందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బిఆర్‌ఎస్ అధిష్ఠానం తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పార్టీ ఘోర ఓటమికి స్థానిక నాయకత్వమే కారణమని ఆరోపించారు. ఎన్నికలను ఎదుర్కోలేని నేతలకే మరోమారు అభ్యర్థులుగా నిలబెట్టడంతో ఎన్నికల్లో విఫలమయ్యామని వ్యాఖ్యానించారు.
పదేళ్ళు అధికారంలో ఉండటం, ఎంఎల్‌ఎలు నియంతల్లా వ్యవహరించడం, అహంకారంగా మాట్లాడటంతో జనం పార్టీకి దూరమయ్యారని గుర్తుచేశారు. అధిష్ఠానంపై విశ్వాసం, నమ్మకం లేకనే నేతలు బిఆర్‌ఎస్‌ను వీడుతున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి అపాయింట్‌మెంట్ అడిగినా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు.
కెసిఆర్ కోటరీతోనే పనిచేయించడం, జగదీష్‌రెడ్డి లాంటి నేతలకు బాధ్యతలు అప్పగించి పనిచేయించడం మూలంగానే పార్టీ ఈ దుస్థితికి వచ్చిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ అమిత్ పోటీ చేయాలనుకున్నా కొందరు నేతలు వ్యవహరించిన తీరుతోనే పోటీ నుండి తప్పుకున్నట్లు ప్రకటించారు.
కెసిఆర్ దక్షిణ తెలంగాణను పట్టించుకోలేదని, ఎస్‌ఎల్‌బిసి, బ్రహ్మణవెల్లెంల వంటి పెండింగ్ ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. తాను ఎంపి అయినప్పుడు లాగులు వేసుకొని తిరిగేవాళ్ళు తననే విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎంఎల్‌సిలపై అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ నేతలు కోరారని, న్యాయసమీక్ష చేసి చట్టబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పారు.
ఎవరి దయాదాక్షిణ్యాలతో తనకు పదవులు రాలేదని పేర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమికి సొంత నేతలే కారణమని, ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాలని సూచించారు.

More Stories
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం
తెలంగాణలో స్వీయగణన నమోదుకు అవకాశం
మావోయిస్టు అగ్రనేత గణపతి త్వరగా లొంగిపోవాలి