హైదరాబాద్ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌ నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. శనివారం  నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.  దీంతో నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉన్నది. శనివారం ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో పొద్దున 7 గంటల నుంచే సూర్యుని సెగలతోపాటు వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

కాగా, భానుడి భగభగలతో రాష్ట్రమంతా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 

కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ సోకి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం, జల్లులు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. తప్పక వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.