
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఖమ్మంలో ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్ రావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణ మంత్రి శుక్రవారం ఖమ్మం వచ్చారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్ నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో దిగింది.
కాగా ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన అనంతరం రక్షణ మంత్రి హెలికాప్టర్ ను ఎన్నికల అధికారులు కొద్ది సమయం పాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి కస్తాల సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు.
హెలికాప్టర్ లోని అణువణువునూ నిశితంగా పరిశీలించారు. సుమారు అరగంట పాటు అధికారులు ఈ తనిఖీలను చేపట్టారు. జిల్లా శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ సైతం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కాగా హెలికాప్టర్ లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని వారు వెల్లడించారు. బహుశా ప్రస్తుత ఎన్నికలలో దేశం మొత్తం మీద ఓ కేంద్ర మంత్రి హెలికాప్టర్ ను తనిఖీ చేయడం ఇదే మొదటి సంఘటన. గత వారం తమిళనాడులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ను సోదా చేశారు.
నామినేషన్ల కార్యక్రమానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఖమ్మం బిజెపి అభ్యర్థి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు శుక్రవారం నామినేషన్ వేయగా, ఈ కార్యక్రమంకు కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ హాజరవడం ఒకింత అందరినీ ఆశ్చర్యపరిచింది. అభ్యర్థి తాండ్ర వినోద రావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకునే ముందు ఖమ్మం నగరంలో భారీ వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొని కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు.
More Stories
12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర
ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం
కాంగ్రెస్ మరోసారి బిసిలను మోసం చేసింది