ఎడారి దేశం దుబాయ్‌లో కుండపోత వర్షం

* ఏడాదిలో కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే

ఎడారి దేశమైన దుబాయిలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 

ఎప్పుడు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడే దుబాయిలో ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయింది. ఇక్కడ ఏడాదిలో నమోదయ్యే వర్షాపాతం.. 24గంటల్లోనే కురిసింది.  గత 75ఏళ్లలో ఎన్నడూలేని విధంగా మంగళవారం జడివాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.  ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రద్దీ ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయి విమానాశ్రయం వర్షాలతో అనేక విమానాలను మళ్లించాల్సి వచ్చింది. దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో సాధారణంగా సాయంత్రం వంద విమానాలు తిరుగుతాయి. వాతావరణ మార్పుల కారణంగా విమానాలన్నింటిని మళ్లించారు.

భారీ వర్షాల కారణంగా విమాన కార్యకలాపాలు ఆలస్యంగా నడుస్తుండడంతో పాటు పలు విమానాలను రద్దు చేశారు. వర్షానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రన్‌వే పూర్తిగా నీటిలో మునిగిపోయింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది.  ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారుల్లో నీరు నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్‌లో సైతం మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. దుబాయితో పాటు పొరుగు దేశం బహ్రెయిన్ కూడా వరదల్లో మునిగిపోయింది. వర్సాలకు 18 మంది మృత్యువాతపడ్డారు. వాస్తవానికి యూఈఏలో వర్షం కురవడం అరుదుగా జరుగుతుంది.

 శీతాకాలంలో మాత్రం పలు సందర్భాల్లో వర్షాలు కురుస్తాయి. గత 24గంటల్లో గంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురిశాయి. దుబాయిలో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లు కాగా.. మంగళవారం సాయంత్రానికి దుబాయి 120 మిమీపైగా వర్షం కురిసింది. భారీ వర్షంతో దుబాయి నగరం అతలాకుతలమైంది. పాఠశాలలు మూతపడ్డాయి.  అయితే దుబాయ్ నుంచి బయల్దేరే విమానాలు మాత్రం యథావిధిగా బయల్దేరుతాయని ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.

నీటితో నిండిపోయిన దుబాయ్ ఎయిర్‌పోర్టును చూస్తే.. వర్షాకాలంలో తరచుగా నీటమునిగే చెన్నై ఎయిర్‌పోర్ట్ గుర్తుకొచ్చింది. భారీ వర్షాల కారణంగా యూఏఈ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల కారణంగా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో దుబాయ్‌లోని జాతీయ రహదారులు, రోడ్లపై వాహనాలు నీట మునిగాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా వీధులన్నీ చెరువులను తలపించాయి. దీంతో కొందరు వీధుల్లో సరదాగా పడవల్లో తిరిగారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.