యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ ప్రయోగం

దేశీయంగా అభివృద్ధి  చేసిన ‘మ్యాన్‌ పోర్టబుల్‌ యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌’ (ఎంపిఎటిజిఎం)ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. దీంతో సైన్యంలోకి యాంటీ ట్యాంక్‌ క్షిపణి వ్యవస్థను చేర్చడానికి మార్గం సుగమమైంది. ఈ క్షిపణిని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) డిజైన్‌ చేసి, అభివృద్ధి చేసినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందులో ఎంపిఎటిజిఎం లాంచర్‌, టార్గెట్‌ అక్విజిషన్‌ ఎక్విప్మెంట్‌, ఫైర్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉన్నాయని, ఈ క్షిపణి వ్యవస్థను తేలికగా తీసుకువెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. ఎంపిఎటిజిఎం ఆయుధ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మదింపు చేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. 

ఈ ఆయుధ వ్యవస్థను శనివారం పోఖ్రాన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంది. మిస్సైల్‌ సిస్టమ్‌ అద్భుతమైన పనితీరును కనబరిచిందని,   ఈ యాంటీ ట్యాంక్‌ క్షిపణి వ్యవస్థను పగలు, రాత్రి సమయాల్లోనూ వినియోగించవచ్చని తెలిపింది.

యాంటీ ట్యాంక్‌ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినందుకు డిఆర్‌డిఒ, భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. ఆధునిక సాంకేతిక ఆధారిత రక్షణ వ్యవస్థల అభివృద్ధిలో  స్వావలంబన సాధించే దిశగా ఇది ఓ కీలకమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.