సందేశ్‌ఖలీపై బెంగాల్ ప్రభుత్వ నివేదిక కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సి

ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో మహిళలపై అక్రమ భూకబ్జాలు, దోపిడీలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులపై తాము  చేసిన 12 సిఫార్సులపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. కమిషన్ జరిపిన విచారణ నివేదిక సందేశ్‌ఖాలీలో అనేక మానవ హక్కుల ఆందోళనలను ప్రస్తావిస్తూ పలు సిఫార్సులు చేస్తూ ఆ రాష్త్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు పంపింది. 
 
అందులో తాము చేసిన ప్రతి సిఫార్సుపై ఎనిమిది వారాల్లోగా తీసుకున్న చర్య  గురించి నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. తమ నివేదిక గురించి విస్తృతంగా ప్రజలకు తెలియడం కోసం ప్రభుత్వం తమ వెబ్ సైట్ లో ఉంచాలని కూడా సూచించింది. కమిషన్ చేసిన 12 సిఫార్సులలో లైంగిక నేరాలకు గురైన బాధితులకు, సాక్షులకు రక్షణ, కౌన్సెలింగ్,  పునరావాసం, చట్టబద్ధమైన యజమానులకు భూమిని తిరిగి ఇవ్వడం, వ్యవసాయానికి అనువుగా ఉండేలా ఆ భూమిని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. 
 
అదేవిధంగా, దేశవ్యాప్త ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ను అమలులోకి తేవడం, ఆ ప్రాంతంలో  తప్పిపోయిన మహిళలు / బాలికల కేసుల దర్యాప్తు కూడా సూచించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి నివేదిక ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల దురాగతాల కారణంగా వాతావరణం బాధితులను మౌనంగా మార్చివేసింది.
 
“గ్రామస్తులు/బాధితులు దాడులు, బెదిరింపులు, లైంగిక దోపిడీ, భూమి లాక్కోవడం, బలవంతంగా వేతనం లేకుండా పనిచేయడం వంటి వేధింపులను ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులలో వారు సందేశ్‌ఖాలీ ప్రాంతం  వెలుపల జీవనోపాధి పొందవలసి వచ్చింది” అని  ఎన్‌హెచ్‌ఆర్‌సి తెలిపింది.  ఈ “భయోత్పాత వాతావరణం” కు కారకులైన నిందితులపై చర్య తీసుకోవడమే కాకుండా బాధితులను మౌనంగా అనుభవించే సంకెళ్ళ నుండి విముక్తి కావించడానికి సురక్షితమైన, సహాయక వాతావరణాన్ని సృష్టించాల్సిన తక్షణ అవసరాన్ని కమిషన్ వ్యక్తపరచింది.