ఎన్నికలకు దేవాలయ ఉద్యోగులను దూరంగా ఉంచండి

ఎన్నికల విధులకు దేవాదాయశాఖ ఉద్యోగులను దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర  మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాశారు. సీఈసీతో పాటుగా ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు పురందేశ్వరి లేఖ రాశారు.

దేవాదాయశాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగిస్తారన్న వార్తల మీద పురందేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ కూడా దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించలేదని లేఖలో పురందేశ్వరి గుర్తు చేశారు. అలాంటిది 2024 ఎన్నికల్లో వారికి విధులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.

 దేవాదాయశాఖ సిబ్బందికి ఎన్నికల డ్యూటీలు కేటాయిస్తే భక్తులు ఇబ్బందులు పడతారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వేసవి సెలవుల కారణంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతుందన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఇలాంటి పరిస్థితుల్లో తగినంత సిబ్బంది లేకపోతే ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు ఎదురౌతాయని చెప్పుకొచ్చారు.

మరోవైపు దేవాదాయశాఖలోని ఉద్యోగుల్లో ఎక్కువ మంది హిందూ మతానికి చెందినవారే ఉంటారని పురందేశ్వరి తెలిపారు. వారిని ఎన్నికల విధులకు వారిని ఉపయోగిస్తే ఒకే మతానికి చెందిన వారిని ఉపయోగించారనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎండోమెంట్ సిబ్బందిని ఉపయోగించే విషయంపై పునరాలోచన చేయాలని ఎన్నికల సంఘాన్ని పురందేశ్వరి కోరారు.

మరోవైపు ఏపీ ఎన్నికల్లో ఇప్పటికే వాలంటీర్లను ఉపయోగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది. వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దని, ఏజెంట్లుగా కూడా వారిని నియమించవద్దంటూ స్పష్టం చేసింది. కొందరు వాలంటీర్లతో రాజీనామాలు చేయించి వారిని తమ ఏజెంట్లుగా పెట్టుకొనేందుకు వైసిపి చేస్తున్న ప్రయత్నాల పట్ల కూడా అభ్యంతరాలు వెల్లడి అవుతున్నాయి.

అలాగే సచివాలయ సిబ్బందికి కీలకమైన బాధ్యతలు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. ఎన్నికల్లో ఓటువేసిన వారికి చేతికి సిరా గుర్తు వేసే చిన్నపాటి పనులను మాత్రమే వారికి కేటాయించాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తాజాగా ఎండోమెంట్ సిబ్బందికి సైతం ఎన్నికల విధులు అప్పగించవద్దంటూ పురందేశ్వరి ఈసీకి లేఖరాశారు.