బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ లో టాపర్

చదువుల్లో రాణించినప్పటికీ కొందరికి కుటుంబ పరిస్థితులు సహకరించవు. దీంతో చదువు మధ్యలోనే ఆపేస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులు కుమార్తెకు పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అనుకుంటారు. ఇదే విధంగా చదువుల్లో రాణిస్తోన్న ఓ బాలికకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలవడంతో చదువు మాన్పించి పెళ్లి చేయాలనుకున్నారు.
 
 కానీ, బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు గానూ 421 మార్కులను సాధించింది.  కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఎస్ నిర్మల అనే బాలిక స్థానిక ప్రభుత్వ కాలేజీలో బైపీసీ చదువుతోంది. 
 
పదో తరగతిలో 537 మార్కులతో ప్రతిభ చాటిన ఆ అమ్మాయి తన చదువు ఆగిపోకూడదని పట్టుబట్టింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువుకొనసాగించాలని నిర్ణయించుకుంది. పెద్ద హరివణం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, హనుమంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా, వీరి చిన్న కుమార్తె నిర్మల. మిగిలిన ముగ్గురికి వారు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపారు. 
 
చదువుల్లో రాణిస్తున్న నిర్మల పై చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ నిర్మలకు చదువుకోవాలన్నా కాంక్ష ఇంకా పెరిగింది.  ఈ క్రమంలో గడపగడపకు కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆ బాలిక ఇంటి వైపు వెళ్లారు. అప్పుడు నిర్మల తన మనసులో మాటను ఎమ్మెల్యేతో చెప్పింది. 
 
తాను పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నానని, ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా స్థోమత లేదని వివరించింది. తనకు సాయం చేసి, తన తల్లిదండ్రులను కూడా ఒప్పించాలని కోరింది. బాలిక ఆకాంక్షను గుర్తించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు.
 
ఆ తర్వాత అధికారులకు నిర్మల విషయాన్ని చెప్పి చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. తక్షణమే కర్నూలు కలెక్టర్‌ డాక్టర్‌ సృజన స్పందించి, ఆస్పరి కేజీబీవీలో బైపీసీ గ్రూప్‌లో చేర్పించాలని ఆదేశించారు. త్రుటిలో బాల్య వివాహాన్ని తప్పించుకుని నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది నిర్మల. 
 
బాల్య వివాహం నుంచి బయటపడిన నిర్మల… టాపర్ గా నిలవటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మలకు అభినందనలు తెలుపుతూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఐపీఎస్‌ అవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల.. బాల్య వివాహాలపై పోరాడుతానని చెప్పింది. తన చదువుకు సహకరించిన కలెక్టర్, అధికారులు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసింది.