జగన్ పై రాయితో దాడి… కనుబొమ్మపై గాయం

* మోదీ, చంద్రబాబు, షర్మిల ఖండన
 
విజయవాడలో శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నిర్వహిస్తున్న వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహనరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. విజయవాడ సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంటరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రజలకు జగన్‌ అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి పూలతోపాటు విసిరిన రాయి అత్యంత వేగంగా వచ్చి ఆయన కనుబొమ్మ పై భాగంలో తాకింది.
 
బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు ఈ ఘటన చేసుకుంది. రాయి సీఎం జగన్ నుదిటి భాగంలో బలంగా తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
దీంతో, సిఎంకు గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపు యాత్రను నిలుపుదల చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిఎంను టాప్‌పై నుండి బస్సులోకి తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం సిఎం జగన్‌ బస్సులోనే కూర్చొని యాత్రను కేశరపల్లి వరకు కొనసాగించారు. అయితే వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జిజిహెచ్‌)కు వెళ్లి ఆయన చికిత్స అందుకున్నారు. 
 
ముఖ్యమంత్రి భార్య వైఎస్‌ భారతి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కాగా దాడి సమయంలో ముఖ్యమంత్రి సిఎం పక్కనే ఉన్న వైసిపి సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు, అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి గాయమైంది. రోడ్‌ షోకు వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకే టిడిపి వారు దాడికి పాల్పడ్డారని వెలంపల్లి ఆరోపించారు.
 
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. జగన్‌పై దాడిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తదితరులు ఖండించారు. జగన్‌పై జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. 
 
రాజకీయాలు ఎప్పుడూ హింసాత్మంగా మారకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సంబంధింత అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.
 
జగన్‌పై జరిగిన దాడి బాధాకరం, దురదృష్టకరమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందేనని ఆమె చెప్పారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.
 
‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!
 
కాగా, ఈ ఘటనపై టిడిపి వ్యాఖ్యానిస్తూ ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అని తెలిపింది.  దెబ్బతగిలిందని నటించబోయే ముందు… కెమెరా ముందు నటించేటప్పుడు అంటూ రెండు ఫొటోలను చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. 
 
కాగా ఈ దాడి టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. విజయవాడలో సీఎం వైయస్ జగన్‌పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. 
 
‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది.