17 మంది భారతీయులతో సహా ఇజ్రాయెల్ కార్గో షిష్‌ ఇరాన్ స్వాధీనం

ఇజ్రాయెల్ సంస్థకు చెందిన  గల్ఫ్‌లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన కంటైనర్ షిప్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం దాడి చేశారు. హెలికాప్టర్‌ నుంచి దానిపై దిగిన కమాండోలు ఆ ఓడను స్వాధీనం చేసుకున్నారు.  ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. 
 
ఎంసీఎస్‌ ఏరీస్ పేరున్న కంటైనర్ షిప్‌ను ఇరాన్‌ నేవీ స్పెషల్ ఫోర్సెస్ అయిన సెపా గార్డ్స్ హెలికాప్టర్‌ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఆ కార్గో షిప్‌లో 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 17 మంది భారతీయులు. ఈ విషయం తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. 
 
ఇరాన్ స్వాధీనంలో ఉన్న ఓడలోని 17 మంది భారతీయ సిబ్బంది భద్రత, సంక్షేమం, విడుదల కోసం ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్‌ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయంతో దౌత్య మార్గాల ద్వారా భారతీయ సిబ్బందిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నది.  యూఏఈ తీరంలోని హార్ముజ్ జలసంధి సమీపం నుంచి ఈ కార్గో షిప్‌ను ఇరాన్‌ జలాల వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించింది.
ఇరాన్‌ కమాండోలు హెలికాప్టర్‌ నుంచి రోప్‌ ద్వారా కంటైనర్ షిప్‌పైకి దిగిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  కాగా, ఇరాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జరిగిన ఈ సంఘటనపై ఇజ్రాయెల్‌ స్పందించింది.  ఈ ప్రాంతంలో వివాదాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని ఇజ్రాయిల్‌ సైన్యం హెచ్చరించింది. 
 
ఇరాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. ఇజ్రాయిల్‌ అప్రమత్తంగా ఉందని అన్నారు. ఇరానీయుల దురాక్రమణ నుండి ఇజ్రాయిల్‌ను రక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, స్పందించనున్నామని ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి వార్తల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా, లుఫ్తాన్సా సంస్థలు ఇరాన్‌ గగనతలం వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపేశాయి.