
పాకిస్థాన్‌లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం చారిత్రక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తున్‌క్వా ప్రావిన్స్‌లోని లాండి కోటల్ బజార్ పట్టణంలో పురాతన ఆలయం ఉన్నది. అంతా దానిని ఖైబర్ టెంపుల్ అని పిలుస్తారు.
దేశ విభజన సమయంలో అక్కడనున్న హిందువులంతా భారత్‌కు వలస వెళ్లడంతో 1947లోనే అది మూతపడింది. అప్పటి నుంచి పట్టించుకునే వారు లేకపోవడంతో క్రమంగా శిథిలావస్థకు చేరింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చివేశారు. గత పది 15 రోజులుగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతున్నదని స్థానికులు వెల్లడించారు.
నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు నిర్థారించారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉన్నట్లు తమ వద్ద ప్రామాణికమైన, క్రమబద్ధమైన రెవెన్యూ రికార్డులు లేవని చెప్పడం గమనార్హం. కాగా, దీనికి సంబంధించి ఇబ్రహిం షిన్వారీ అనే పాక్ జర్నలిస్టు మాట్లాడుతూ లాండి కోటల్ బజార్ నడిమధ్యలో చారిత్రక దేవాలయం ఉందని స్పష్టం చేశారు.
1947లో భారత్-పాకిస్థాన్ విభజన తర్వాత హిందూ కుటుంబాలకు ఇండియాకు తరలివెళ్లడంతో అది మూతపడింది. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన్నపుడు ఇక్కడ కొందరు వ్యక్తులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. తన బాల్యంలో ఈ ఆలయాన్ని గురించి చాలా కథలు విన్నామని చెప్పారు. ప్రస్తుతం దానిని కూల్చివేసి వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు.
మరోవైపు, ముస్లిమేతరుల మతపరమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పాకిస్థాన్ హిందూ దేవాలయ నిర్వహణ కమిటీ హరూన్ సర్బాడియాల్ తెలిపారు. మతపరమైన మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే అన్ని ప్రార్థనా స్థలాలు, చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేసారు.
More Stories
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
గాజాలో అమెరికా ఎత్తుగడలకు సౌదీ చెక్
యూఎస్ మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకాలపై నిషేధం