ఆయుస్మాన్‌ భారత్‌లో 70 ఏండ్లు పైబడిన వృద్ధులు

* ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో 14 అంశాల బీజేపీ మేనిఫెస్టో 
 
2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో యువత, పేదలు, మహిళల అభ్యన్నతే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)  మేనిఫెస్టోను విడుదల చేసింది. 70 ఏండ్లు పైబడిన వృద్ధులనూ ఆయుస్మాన్‌ భారత్‌లో చేరుస్తామని, రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తాని ప్రకటించారు. పేదలకు 4 కోట్ల ఇండ్లు కట్టించి ఇచ్చామని, మరో మూడు కోట్ల ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పారు.
 
బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్లడించారు. దేశాభివృద్ధికి అవినీతి ఆటంకంగా మారిందని చెప్పారు.
 
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో 14 అంశాలతో కూడిన బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు స్తంభాలతో సంకల్ప్‌ పత్రకు పునాదులు వేశామని, యువశక్తి, నారీ శక్తి, గరీబ్‌, కిసాన్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేశామన్ని తెలిపారు. 
 
దేశ యువత ఆకాంక్షలను తమ సంకల్ప్‌ పత్ర ప్రతిబింబిస్తున్నదని చెప్పారు. గత ఐదేండ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామన్నారు. ఉచిత రేషన్‌ను వచ్చే ఐదేండ్లు కూడా అందిస్తామని చెప్పారు. ‘భవిష్యత్తులో పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందిస్తాం. పీఎం సూర్య ఘర్‌ పథకానికి కోటి మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు తమ ఇంట్లో తయారైన కరెంటును అమ్ముకోవచ్చు. ముద్ర పథకం కింద కోట్ల మందికి స్వయం ఉపాధి లభించింది. ఈ పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలు చేస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తాం’ అని వెల్లడించారు.

దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. పదేండ్లలో 10 కోట్ల మంది స్వయం సహాయక సంఘాల్లో చేరారు. మహిళలు పారిశ్రామికవేత్తలు కావాలని ప్రోత్సహిస్తున్నాం. వచ్చే ఐదేండ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం పెంచుతాం. భారత్‌ను గ్లోబల్‌ న్యూటిషన్‌ హబ్‌గా మారుస్తామని వివరించారు. 

 శ్రీ అన్న్‌ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తాం. భారత్‌ను ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వల్ల గ్రామాల ఆదాయం పెరుగుతుంది. నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. భారత్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తామని ప్రధాని తెలిపారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పారు. ఏజెన్సీల్లో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తామని పేర్కొన్నారు. 

‘సోషల్‌, డిజిటల్‌, ఫిజికల్‌ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేకచోట్ల శాటిలైట్‌ పట్టనాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. దేశంలో మూడు రకాల వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌, వందే భారత్‌ మెట్రో రైళ్లు అందుబాటులోకివస్తాయి. దేశం నలుమూలలా బుల్లెట్‌ రైళ్లు తెస్తాం. ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు మార్తం పూర్తికానుంది. దక్షిణ, ఉత్తర, తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తాం’ అని వివరించారు.

దేశంలో ఈవీ మార్కెట్‌ శరవేగంగా దూసుకెళ్తున్నది. ఈ పదేండ్లలో 17 లక్షల వాహానాలను అమ్ముడుపోయాయి. భారత్‌ను గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌, సెమీ కండక్టర్‌ హబ్‌గా మారుస్తాం. అంతరిక్షంలోనూ భారత్‌ సత్తా చాటుతున్నది. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తాం. దేశాభివృద్ధికి అవినీతి ఆటంకంగా నిలిచిందని’ ప్రధాని మోదీ తెలిపారు.