సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం గెలాక్సీ అపార్టుమెంట్స్‌ బయట నాలుగు రౌండ్లు కాల్చారు.
 
 సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.  మహారాష్ట్ర ముఖ్యమంతి ఎకనాథ్ షిండే సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ తో కూడా మాట్లాడి దర్యాప్తు, భద్రతా అంశాల గురించి చర్చించారు.
 
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందని, వారి ప్రధాన లక్ష్యాల్లోని టాప్ 10లో ఆయన ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గతేడాది వెల్లడించింది. సల్మాన్ హత్యకు గ్యాంగ్ కుట్రలు చేస్తోందని తెలిపింది.  1998లో కృష్ణజింకలను వేటాడిన ఘటనకు ప్రతీకారంగా ఆయన్ను చంపుతామని బెదిరించింది. గతేడాది ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఓ ఆగంతకుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. ఆగంతుకుడు తన పేరు రాకీ భాయ్ అని, జోధ్పూర్‌కు చెందిన గోరక్షకుడినని ఫోన్ లో చెప్పాడు.

2018లో విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ .. కోర్టు ఆవరణలోనే సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన ధాకడ్ రామ్ సిహాగ్ అనే దుండగుడిని రాజస్థాన్ పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉండటంతో ఆయనకు వై ప్లస్‌ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. 

 
తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. గతేడాది ఏప్రిల్‌ 11న సల్మాన్‌కు చంపుతామంటూ బెదిరిస్తూ ఈ- మెయిల్‌ వచ్చింది. యూకేలో ఉంటున్న భారత యువకుడు అది చేసినట్లు గుర్తించిన పోలీసులు, అతనిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీచేశారు.