
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌కు ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచించింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది.
ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లోని పౌరులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యతమివ్వాలని, భద్రంగా ఉన్నామో లేదో గమనించుకోవాలని అడ్వైజరీ పేర్కొంది. కదలికలను వీలైనంత మేర తగ్గించుకోవాలని పేర్కొంది. ఈ సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.
కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్రం ఈ ప్రకటన జారీ చేసింది. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఇరాన్ అగ్రశ్రేణి ఆర్మీ జనరల్, మరో ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు.
ఈ నేపథ్యంలో ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్నది. అయితే ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ చెబుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన కూడా చేసింది. ఇజ్రాయెల్‌పై తాము చేయబోతున్న దాడికి అడ్డు రావొద్దంటూ అమెరికాకు ఇరాన్ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.
48 గంటల్లోగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం తెలిపింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సమాచారం ఉన్న ప్రతినిధి తెలిపారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్షంగా దాడి చేస్తే పొంచివుండే రాజకీయ ముప్పులను ఇరాన్ అంచనా వేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
దాడి ప్రతిపాదినపై తుది నిర్ణయం ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వాధినేత అయాతుల్లా అలీ ఖమేనీ వద్ద ఉందని, రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నట్టుగా ఆయన సలహాదారు చెప్పారని కథనం పేర్కొంది. మరోవంక, ఇరాన్ నేరుగా దాడులు చేయకపోయినప్పటికీ.. లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్ బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ పై దాడులు చేయించొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది.
More Stories
లడ్డూ కల్తీ నెయ్యి సూత్రధారుల కోసం ఇక వేట
గాజాలో అమెరికా ఎత్తుగడలకు సౌదీ చెక్
యూఎస్ మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకాలపై నిషేధం