బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్ కాదు’

బోర్న్‌విటాలో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవల ఎన్‌సీపీసీఆర్ నిర్ధారించిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కీలక అడ్వైజరీని జారీ చేసింది. బోర్న్‌విటా ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరిలోకి రాబోదని తెలిపింది. ఈ కేటగిరి నుంచి బోర్న్‌విటాను తొలగించాలని ఈ-కామర్స్ కంపెనీలను వాణిజ్యమంత్రిత్వశాఖ ఆదేశించింది. 
 
తమ వెబ్‌సైట్లు, ఇతర ప్లాట్‌ఫామ్స్‌పై బోర్న్‌విటాతో పాటు అన్ని డ్రింక్స్, బేవరేజులను హెల్త్ కేటగిరి నుంచి తొలగించాలని సలహా ఇచ్చింది.  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సీపీసీఆర్) చట్టం-2005లోని సెక్షన్ (3) కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్‌సీపీసీఆర్ (నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఇటీవల సీఆర్‌పీసీ-2005 చట్టంలోని సెక్షన్ 14 విచారణ చేపట్టింది. 
 
ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006, మోడల్జ్ ఇండియా ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పించిన నియమ, నిబంధనలు ‘హెల్త్ కేటగిరి డ్రింక్స్’ను నిర్వచించలేదని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని, ఆమోదయోగ్య పరిమితులకు మించి ఎక్కువగా ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్ చేసిన పరిశోధనలో తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది. 

కాగా భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమవ్వడమే కాకుండా పవర్ సప్లిమెంట్స్‌ను ‘హెల్త్ డ్రింక్స్’గా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గతంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీని (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఎన్‌సీపీసీఆర్ కోరింది.

కాగా రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం దేశంలోని ఆహార చట్టాలలో ‘హెల్త్ డ్రింక్’ నిర్వచించలేదు. దీంతో కంపెనీలు తమ ఉత్పత్తులను ఏమార్చుతూ ప్రచారం చేసుకుంటున్నాయి. డైయిరీ ఆధారిత పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’గా లేబుల్ వేసి విక్రయించవొద్దని ఈ నెల ఆరంభంలోనే ఈ-కామర్స్ పోర్టల్‌లను కేంద్రం ఆదేశించింది.

బోర్న్‌విటాలో చక్కెర, కోకో స్థాయిలు అధికంగా ఉన్నాయని ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అతడు విమర్శించడంతో ఎన్‌సీపీసీఆర్ రంగంలోకి దిగింది.