జీవిత కాల గ‌రిష్టానికి ఫారెక్స్ రిజ‌ర్వు నిల్వ‌లు

విదేశీ మార‌క ద్ర‌వ్యం (ఫారెక్స్ రిజ‌ర్వు) నిల్వ‌ల్లో తాజా గ‌రిష్టం న‌మోదైంది. ఏప్రిల్ ఐదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజ‌ర్వు నిల్వ‌లు 2.98 బిలియన్ డాల‌ర్లు వృద్ధి చెంది, రూ.648.562 బిలియ‌న్ డాల‌ర్ల‌కు వృద్ధి చెందింద‌ని ఆర్బీఐ శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇంత‌కుముందు వారం 2.951 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగి 645.583 బిలియ‌న్ డాల‌ర్లు వృద్ధి చెంది ఆల్‌టైం గ‌రిష్టానికి చేరుకున్న‌ది.
2021 సెప్టెంబ‌ర్‌లో ఫారెక్స్ రిజ‌ర్వ్ నిల్వ‌లు 642.453 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఆల్‌టైం హై రికార్డ్ న‌మోదు చేస్తే, గ‌త నెల‌లో ఆ స్థాయికి చేరుకున్న‌ది.  గ‌త కొన్ని నెల‌లుగా డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ‌తోపాటు అంత‌ర్జాతీయ ఒత్తిళ్ల వ‌ల్ల ఫారెక్స్ నిల్వ‌ల్లో ఒడిదొడుకులు న‌మోద‌వుతాయి. కానీ, కొన్ని నెల‌లుగా ఫారెక్స్ రిజ‌ర్వ్ నిల్వ‌లు క్ర‌మంగా స్థిరంగా పెరుగుతున్నాయి. 
ఏప్రిల్ ఐదో తేదీతో ముగిసే నాటికి ఫారిన్ క‌రెన్సీ అసెట్స్ 549 మిలియ‌న్ డాల‌ర్లు వృద్ధి చెంది 571.166 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది.  యూరో, పౌండ్‌, యెన్ వంటి విదేశీ క‌రెన్సీ విలువ‌ల్లో మార్పులు చేర్పుల ప్ర‌కారం ఫారిన్ క‌రెన్సీ అసెట్స్ ఖ‌రార‌వుతాయి. ఏప్రిల్ ఐదో తేదీతో ముగిసిన వారానికి బంగారం రిజ‌ర్వు నిల్వ‌లు 2.398 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగి 54.558 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. 
 
స్పెష‌ల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్‌) 24 మిలియ‌న్ డాల‌ర్లు వృద్ధి చెంది 18.17 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరాయి. అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లో భార‌త్ ఫారెక్స్ నిల్వ‌లు తొమ్మిది మిలియ‌న్ డాల‌ర్లు పెరిగి 4.669 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగాయి.