మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తమిళ సినీ నిర్మాత , డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్ సాదిక్ కొన్ని కోట్ల రూపాయలను చిత్ర పరిశ్రమ, ఇతర వ్యాపారాలకు వినియోగించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఏప్రిల్ 9న చెన్నై, మధురై, తిరుచురాపల్లిలో ఫెడరల్ ఏజెన్సీ జరిపిన దాడుల ఆధారంగా ఈడీ శనివారం ఈ ప్రకటనను విడుదల చేసింది.
డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా ఆర్జించిన రూ. 40 కోట్లను జాఫర్ చిత్ర నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి మళ్లించినట్టు పేర్కొంది. వీటిలో రూ. 6 కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు చెల్లింపులు జరిపినట్టు తెలిపింది. రూ. 12 కోట్లకు పైగా సినీ నిర్మాణంలో , రూ. 21 కోట్లను బ్యాంకు ఖాతాల్లో గుర్తించినట్టు ఈడీ వివరించింది. స్థిరాస్తుల కోసం ఎక్కువ మొత్తంలో వినియోగించినట్టు పేర్కొంది. అంతర్జాతీయ డ్రగ్ అక్రమ రవాణాలో సిద్ధిఖీ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని ఈడీ భావిస్తున్నది.
జాఫర్ సిద్ధిఖీ భారత్‌లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని ఈడీ గుర్తించింది. ఆయన రూ.70 కోట్లకు పైగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని, దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ ఈడీ వెల్లడించింది. రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ పరిధిలో మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
కోలీవుడ్ లో నాలుగు సినిమాలు నిర్మించిన జాఫర్ సాదిక్ , రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి ఆఫీస్ బేరర్‌గా పనిచేశారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో డీఎకే అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది. పరారీలో ఉన్న జాఫర్‌ను మార్చిలో ఎన్‌సిబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే .
More Stories
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం
మహా కుంభ మేళాకు వెళ్లే వారికి 13వేల రైళ్లు
బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాలలో మూడో స్థానంలో భారత్