కాంగ్రెస్ ను మించిన నియంత పాలన మరొకటి ఉండదు

* చైనాతో సరిహద్దులో యథాతథ స్థితి.. కాంగ్రెస్ హామీపై మండిపాటు

భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను నియంతలుగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు.1975లో ఎమర్జెన్సీ సమయంలో తన వయస్సు 23 ఏళ్లని, ఆ వయస్సులో తనను 18 నెలల పాటు జైలుకు పంపిన ఎమర్జెన్సీని ఆయన గుర్తు చేస్తూ  అత్యవసర స్థితి విధించిన కాంగ్రెస్ పాలనను మించిన నియంత పాలన మరొకటి ఉండదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ సమయంలో  తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని రక్షణ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్ ఇవ్వమని కోరగా, నిరాకరించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారు (కాంగ్రెస్) తమను నియంతలు అంటున్నారని రక్షణ మంత్రి ఎద్దేవా చేశారు. 

బ్రెయిన్ హెమరేజ్ కు చికిత్స పొందుతూ 27 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమెను చివరి రోజుల్లో కూడా కలవలేకపోయానని రాజ్ నాథ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తానాషాహీ లేదా నియంతృత్వ పాలన సాగిస్తోందన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఎమర్జెన్సీ ద్వారా నియంతృత్వాన్ని విధించిన వ్యక్తులు తమపై నియంతృత్వ ఆరోపణలు చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు.

కాగా, చైనాతో సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని  లోక్ సభ  ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ పట్ల రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో భారత్ కు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ స్వాధీనం చేసుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

‘‘అంగుళం భూమిని కూడా వదులుకోబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాం’’ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేయగలదా? అని ఆయన ప్రశ్నించారు. వారి పాలనలో ఏం జరిగిందో, ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల భూమి చైనా ఆధీనంలోకి వెళ్లిందో చరిత్రలో ఉందని గుర్తు చేశారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పాకిస్తాన్ అశక్తత వ్యక్తం చేస్తే, భారత్ పాక్ లో ఉగ్రవాద నిర్మూలనకు సాయం చేస్తుందని రాజ్ నాథ్ సింగ్ మరోసారి ఆఫర్ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరుకు పాకిస్తాన్ కు సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. 

‘‘కానీ, ఉగ్రవాదం సాయంతో భారత్ ను అస్థిరపరిచేందుకు పాక్ ప్రయత్నిస్తే దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని  రక్షణ మంత్రి హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదాన్ని నియంత్రించే సత్తా తమకు లేదని పాక్ భావిస్తే భారత్ సాయం తీసుకోవచ్చు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు పాక్ కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు. భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులను అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. దాన్ని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడ‌ల్ విలేజ్‌తో పాటు డిఫెన్స్ పోస్టుల‌ను చైనా నిర్మిస్తోంద‌న్న వార్త‌ల‌పై స్పందిస్తూ ఎల్ఏసీ అటువైపు వారు అలా చేస్తే ఎల్ఏసీ ఇటువైపున మ‌నం నిర్మాణ ప‌నులు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. చైనా వైపు వారు అభివృద్ధి చేసుకుంటే మ‌న వైపు మ‌నం కార్య‌క‌లాపాలు సాగించ‌వ‌చ్చ‌ని మంత్రి తెలిపారు.

అయితే ఇరు దేశాల మ‌ధ్య శాంతి, సామ‌ర‌స్యం కొన‌సాగ‌డం ముఖ్య‌మ‌ని వ్యాఖ్యానించారు.  ఈ దిశ‌గా భార‌త్‌, చైనా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు.