జమ్మూ కశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికలు

త్వరలోనే జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదంపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తూ తాను ఎప్పుడూ భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ముందు చూపుతోనే ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
 
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్ స్థానం నుంచి లోక్ సభకు వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని అందించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాలుగేళ్ల తర్వాత ఈ లోక్ సభ ఎన్నికలకు జరుగుతున్నాయి. దశాబ్దాల తర్వాత ఉగ్రవాదం, సీమాంతర కాల్పుల బెడద లేకుండా జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు.
 

‘మోదీ ఎప్పుడైనా ముందుచూపుతోనే ఆలోచిస్తాడు. ఇప్పటి వరకూ జమ్ముకశ్మీర్‌లో వచ్చిన మార్పులు కేవలం ట్రైలర్ మాత్రమే. జమ్ము కశ్మీర్‌ను అద్బుత రాష్ట్రంగా మలిచే పనిలో బిజీగా ఉన్నాను. రానున్న రోజుల్లో అందమైన సినిమాని చూపిస్తాం. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం ఎంతో దూరంలో లేదు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కూడా దక్కుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇక్కడి ప్రజలు ముఖాముఖి మాట్లాడొచ్చు. మీ సమస్యలను వారితో పంచుకోవచ్చు’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు.

‘‘దశాబ్దాల తర్వాత ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాళ్ల దాడులు, దాడులు, సీమాంతర ఉగ్రవాదం లాంటి భయం లేకుండా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. వైష్ణోదేవి, అమర్‌నాథ్‌ల భద్రతపై ఆందోళన ఉండేది. తీర్థయాత్రలు, కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూస్తోంది. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం బలపడుతోంది” అని ప్రధాని తెలిపారు.
 
జమ్ము కశ్మీర్‌‌  అద్బుత రాష్ట్రంగా మలిచే పనిలో బిజీగా ఉన్నానని చెబుతూ జమ్ము కశ్మీర్‌లో ఎంతో కాలంగా ప్రజలు పడుతోన్న ఇబ్బందులు తాను ఇస్తున్న హామీలతో తొలిగిపోనున్నాయని తెలిపారు. అయితే జమ్ము కశ్మీర్‌లో మళ్లీ అర్టికల్ 370ని ప్రతిపక్షాలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్బంగా మోదీ ఆరోపించారు. 
 
అయితే, “ఆర్టికల్ 370ని మళ్లీ తిరిగి తీసుకురాగలరా? ఏ రాజకీయ పార్టీకైనా, ముఖ్యంగా కాంగ్రెస్ కు సవాల్ విసురుతున్నాను. వారు అలా చేయలేరు’’ అని ప్రధాని స్పష్టం చేశారు.  కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడేంందుకు ఈ ఎన్నికలు దోహదం చేస్తాయని ప్రజలు సూచించారు. ‘‘దయచేసి నన్ను నమ్మండి, గత 60 ఏళ్లుగా జమ్ముకశ్మీర్ ను పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరిస్తాను’’ అని మోదీ భరోసా ఇచ్చారు.  
 
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా డ్రోన్లను ఎగురవేయడంపై నిషేధం సహా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు చేశారు. నెలన్నర కాలంలో మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటించడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 20, మార్చి 7 తేదీల్లో జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు.