మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఢిల్లీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. కేవలం మూడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది.

అంతకు ముందు సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ తోసిపుచ్చింది. తొలుత తీహార్ జైలులో ఉన్న ఆమెను అదుపులోకి తీసుకున్న సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది.  ఈ సందర్భంగా కోర్టులో కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది.

లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని తెలిపింది. విజయ్ నాయర్ తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమమవుతోందని కోర్టుకు తెలిపింది.

రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 కోట్లు అందజేశారని పేర్కొంది. వాట్సాప్ చాట్‌లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందజేశామని తెలిపింది.  బుచ్చిబాబు స్టేట్ మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 33 శాతం వాటా ఉందని తెలిపింది.

కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు. ఈ విషయాలను చార్జిషీట్లలో పొందుపరిచామని సీబీఐ న్యాయవాది తెలిపారు. శరత్ చంద్రారెడ్డి కవితకు చెందిన జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది.

ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని తెలిపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది.

మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట.  అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పారట. కానీ, రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారట. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారట. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది.

ఇది ఇలా ఉంటే విచారణకు ముందు కోర్టు హాలులో కవిత తన అరెస్ట్ అక్రమం, అన్యాయం అని అని పేర్కొన్నారు. త‌న‌ను అరెస్ట్ చేయబోయే విషయం రాత్రి 10:30 గంటలకు చెప్పారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. తమకెలాంటి సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అరెస్ట్ చేసిందని, తన హక్కులను కాపాడాలని, అరెస్ట్ అక్రమం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు