సముద్ర గర్భంలో కోటి టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు

సముద్ర గర్భంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, దాదాపు 30 లక్షల టన్నుల నుంచి ఒక కోటి పది లక్షల టన్నుల పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుబడివుండొచ్చునని ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సిఎస్‌ఐఆర్‌ఒ) తెలిపింది. ప్రతి నిమిషమూ సముద్రంలో ప్లాస్టిక్‌ చెత్త చేరిపోతోందని సిఎస్‌ఐఆర్‌ఒ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 
 
ప్లాస్టిక్‌ కాలుష్య భూతానికి సముద్ర గర్భం ఓ విశ్రాంతి ప్రదేశంగా లేదా ఓ రిజర్వాయర్‌గా మారిందని వ్యాఖ్యానించారు. ప్లాస్టిక్‌ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి సముద్ర అవశేషాలతో కలిసిపోతున్నాయి. సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల చేరికపై అధ్యయనం నిర్వహించడం ఇదే మొదటిసారి సిఎస్‌ఐఆర్‌ఒ సీనియర్‌ పరిశోధక శాస్త్రవేత్త డెనైస్‌ హార్డెస్టీ చెప్పారు. 
 
సముద్ర ఉపరితలంపై తేలియాడుతున్న దాని కంటే సముద్ర గర్భంలో వంద రెట్లు అధికంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయని తాము అంచనా వేస్తున్నామని తెలిపారు. సముద్రంలో పేరుకుపోయిందని భావిస్తున్న 3-11 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలలో 54% సముద్రంలో 200 మీటర్ల నుండి 11,000 మీటర్ల లోతుకు చేరిందని పరిశోధకులు తెలిపారు. 
 
మిగిలిన 46% వ్యర్థాలు 200 మీటర్ల లోతు కంటే పైనే ఉన్నాయని చెప్పారు. మిగిలిన సముద్ర గర్భంలో ఎంత ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయో లోతట్టు, కోస్తా ప్రాంతంలోని సముద్రాలలో అంత వ్యర్థాలు ఉన్నాయని వివరించారు. ప్లాస్టిక్‌ వినియోగం 2040 నాటికి రెట్టింపు అయ్యే అవకాశం ఉండడంతో సముద్ర పర్యావరణ వ్యవస్థను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని పరిశోధకులు సూచించారు.