మెట్రో టికెట్‌పై రాయితీలు, హాలిడే కార్డు రద్దు

హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు ప్రజలు. ఉదయం, సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు మెట్రో బాటపట్టారు. అయితే అధికారులు మాత్రం ప్రయాణికులు షాకిచ్చారు. 
 
మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు.. రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, గతేడాది ఏప్రిల్‌ కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీవేళ్లలో డిస్కౌంట్‌ను పూర్తిగా రద్దుచేశారు. తాజాగా మరోసారి అదే విధానాన్ని అమలుచేస్తున్నారు.
 
గతంలో సెలవు దినాల్లో రూ. 59తో రోజంతా ప్రయాణించే విదంగా హాలిడే కార్డును తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో. అయితే ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ పెరగటంతో ఈ కార్డును ఎత్తివేసింది. ఈ హాలీడే కార్డు  ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఇది అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ఈ కార్డును మెట్రో పూర్తిగా రద్దు చేసేసింది. మార్చి 31వ తేదీతోనే ఆపివేసినట్లు తెలిసింది. 
 
సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని సైతం ఎత్తివేసింది. ఈ వేసవిలో చాలా మంది ప్రయాణికులు మెట్రోలోనే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్లను రద్దు చేసినట్లు తెలిసింది.