సీఎం జగన్ కు ఈసీ నోటీసులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నేత వర్ల రామయ్య సీఈవో ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ తన ప్రసంగాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబును అరుంధతి సినిమాలో పసుపతితో పోల్చుతూ సీఎం జగన్ వ్యగ్యంగా వ్యాఖ్యలు చేశారని ఈ తప్పుడు ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాద ముందని సీఈఓ మీనాకు వివరించారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అలాగే వలంటీర్లను విధులకు దూరం పెట్టడం వల్ల రెండు రోజుల్లోనే 31 మంది చనిపోయారని.. అందుకే చంద్రబాబును హంతకుడని జగన్ విమర్శించారు. జగన్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏప్రిల్ మూడో తేదీన చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా ఫిర్యాదు చేశారు.

అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచివచ్చిన పశుపతిలా.. ఐదేళ్ల తర్వాత అధికారం కోసం పసుపుపతి వస్తున్నారంటూ చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. అలాగే చంద్రముఖిలా లకలక అంటూ రక్తం పీల్చేందుకు రెడీ అయ్యారని, నేరాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా సీఎం జగన్ కు   ఆదివారం  నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులపై సకాలంలో స్పందించకపోతే ఈసీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని సీఈవో తెలిపారు. 
 
కాగా, అంతకు ముందు టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడులకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సీఈవో ముకేష్‌ కుమార్ మీనా చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు ఈసీ సూచించింది. 
 
మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు ఎన్నికల కోడ్  ఉల్లంఘించి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ సీఈవోకు ఫిర్యాదు చేసింది. సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ రాక్షసుడు, జంతువు, దొంగ అని చంద్రబాబు మాట్లాడారని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. చంద్రబాబు అనుచిత పదజాలం, దుర్భాషలాడారని, నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.