సందేశ్‌ఖాలీ అకృత్యాలు 1 శాతం నిజమైనా సిగ్గుచేటు

 
* మమతా ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ గ్రామం ఇటీవల దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడటమేగాక, వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు బాధితుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో దేశ వ్యాప్తంగా సందేశ్ ఖాలీ ఘటనలు దుమారం రేపాయి.

ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సందర్బంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడిత అందుకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. బెంగాల్ మహిళలకు సురక్షితమేనా? అని ప్రశ్నించారు. ఈ వివాదంపై దర్యాప్తు జరిపించాలని దాఖలైన అఫిడవిట్లపైనా స్పందించింది.

‘అఫిడవిట్‌లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక్క శాతం వాస్తవమున్నా.. అది పూర్తిగా సిగ్గుచేటు. అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలి’ అని కలకత్తా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 
 
కాగా, అరెస్టు తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజులపాటు షాజహాన్ పరారీలో ఉండటంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చివరకు హైకోర్టు కలగజేసుకుని అతన్ని అరెస్ట్ చేసే అధికారం ఈడీ, సీబీఐలకు ఉందని చెప్పిన తర్వాత బెంగాల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 
 
“55 రోజులు పరారీలో ఉన్నాడు. దాగుడు మూతలు ఆడారు. మీరు కళ్లు మూసుకుంటే ప్రపంచం చీకటిగా మారదు” అని పోలీసులు, బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. ఫిబ్రవరి నెలలో పోలీసులు షాజహాన్ షేక్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 
 
ఇది ఇలావుంటే, షాజహాన్ ఆకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖా పత్రా అనే మహిళ అక్కడి మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. అతడి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేఖా పత్రాకు బెంగాల్‌లోని బసిర్‌హట్ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు.