యూపీఐతో త్వరలో మనీ డిపాజిట్

యూపీఐ ఆధారిత ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్‌పే తదితర మొబైల్ యాప్స్ ద్వారా క్షణాల్లో బంధువులకు, మిత్రులకు, వ్యాపార లావాదేవీలకు నగదు బదిలీ చేయొచ్చు. అదే యూపీఐ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. 
 
ఇందుకోసం థర్డ్ పార్టీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అప్లికేషన్లను ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లతో అనుసంధానించాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాస ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం శుక్రవారం ముగిసింది. యూపీఐ ఐడీతో ఎటీఎంలలో నగదును డిపాజిట్ చేసే సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడిస్తూ ఈ సదుపాయానికి సంబంధించిన కార్యాచరణ సూచనలు త్వరలో విడుదల చేయనున్నామని చెప్పారు.
 
ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ బ్యాంకు శాఖలపై క్యాష్ హ్యాండ్లింగ్ లోడ్ తగ్గించడానికి, ఖాతాదారుల సౌకర్యార్థం క్యాష్ డిపాజిట్ మెషిన్ల (సీడీఎం)ను బ్యాంకులు ఏర్పాటు చేస్తాయని తెలిపారు.  ఇప్పటివరకు డెబిట్ కార్డుల వినియోగంతో మాత్రమే నగదు డిపాజిట్ సౌకర్యం లభిస్తుంది.
యూపీఐ ఐడీతో, కార్డ్ అవసరం లేకుండానే, ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని ఇప్పటికే పలు బ్యాంకులు ప్రారంభించాయి. ఆ విధానం ద్వారా నేర్చుకున్న పాఠాల నుంచి యూపీఐ ద్వారా ఏటీఎంలలో నగదును జమ చేసే విధానాన్ని ప్రారంభిస్తున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. 
 
క్యాష్ డిపాజిట్ మెషీన్లలో నగదు డిపాజిట్ చేయడానికి చాలా మంది వినియోగదారులు డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ‘‘సీడీఎంలు నగదును హ్యాండిల్ చేయడంలో బ్యాంక్ ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాయి. దాంతో, బ్యాంక్ ల్లో పొడవైన క్యూలను నివారించడం సాధ్యమైంది’’ అని వివరించారు.
 
‘తాజాగా యూపీఐ సేవలకు పాపులారిటీతోపాటు ఆమోదం పెరుగుతుండటంతోపాటు ఏటీఎంల వద్ద ‘డెబిట్ కార్డు’ లేకుండా యూపీఐ ద్వారా నగదు విత్ డ్రాయల్ చేయొచ్చు. యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ ఫెసిలిటీ కల్పించాలని ప్రతిపాదిస్తున్నాం’ అని శక్తికాంత దాస్ చెప్పారు. త్వరలో ఈ సేవలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
 
రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించనున్నట్లు ఆయన ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం.  ద్రవ్యోల్బణం రేటు స్థిరత్వం, ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రెపో రేటు మునుపటిలాగే 6.5 శాతంగా ఉంది.

ఆహార ధరల్లో అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆర్‌బీఐ అప్రమత్తంగానే ఉందన్నారు. ఎంఎస్ఎఫ్ రేటు 6.75% వద్ద ఉంది. ఆరుగురిలో ఐదుగురు ఎంపీసీ సభ్యులు రెపో రేటును యథాతథంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తెలిపారు.